Aratikaya Pesarapappu Kura : మనం పచ్చి అరటికాయను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పచ్చి అరటికాయలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, జీర్ణశక్తి మెరుగుపరచడంలో పచ్చి అరటికాయలు మనకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే వీటిలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కనుక షుగర్ వ్యాధి గ్రస్తులు కూడా వీటిని ఆహారంగా తీసుకోవచ్చు. ఈ పచ్చి అరటికాయలతో మనం చిప్స్, వేపుళ్లు వంటి వాటితో పాటు వివిధ రకాల ఆకుకూరలను కూడా తయారు చేస్తూ ఉంటాం. పచ్చి అరటికాయలతో చేసుకోదగిన కూరల్లో అరటికాయ పెసరపప్పు కూర కూడా ఒకటి. ఈ కూర తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. ఎవరైనా దీనిని తేలికగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే అరటికాయ పెసరపప్పు కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అరటికాయ పెసరపప్పు కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
మెత్తగా ఉడికించిన అరటికాయల ముక్కలు – 3 కప్పులు, ఉడికించిన పెసరపప్పు – అర కప్పు, నూనె – రెండు టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన పచ్చిమిర్చి – 3, ఎండుమిర్చి – 3, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత.
అరటికాయ పెసరపప్పు కూర తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత ఉడికించిన అరటికాయ ముక్కలు, పెసరపప్పు వేసి కలపాలి. తరువాత పసుపు, ఉప్పు వేసి కలపాలి. ఈ కూరను తడి అంతా పోయి పొడి పొడిగా అయ్యే వరకు కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో కమ్మగా ఉండే అరటికాయ పెసరపప్పు కూర తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా అరటికాయలతో కూరను వండుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ కూరను వద్దనకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.