Vada In Coconut Shell : మనం ఉదయం పూట అల్పాహారంగా తయారు చేసే వంటకాల్లో వడలు ఒకటి. వడలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. వడలు ఇష్టమే అయినప్పటికి చాలా మంది వీటిని తయారు చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. వడలను నూనెలో వేయడం రాక చేతులు కాల్చుకుంటూ ఉంటారు. ఒక చిన్న చిట్కాను ఉపయోగించి చేతులు కాల్చుకునే అవసరం లేకుండా మనం వడలను తయారు చేసుకోవచ్చు. వడలను సులభంగా వేసుకోగలిగే ఆ చిట్కా ఏమిటి.. అలాగే రుచిగా వడలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వడ తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపప్పు – 2 కప్పులు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన కరివేపాకు – రెండు రెమ్మలు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, జీలకర్ర – అర టీ స్పూన్.
వడ తయారీ విధానం..
ముందుగా మిననప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. మినపప్పు చక్కగా నానిన తరువాత వాటిని మరోసారి శుభ్రంగా కడిగి జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు వీలైనంత వరకు నీళ్లు వేయకుండా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ పిండిని ఒక గంట పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. ఇలా ఫ్రిజ్ లో ఉంచడం వల్ల వడలు చక్కటి రంగుతో వస్తాయి. ఇలా ఫ్రిజ్ లో ఉంచిన తరువాత పిండిని బయటకు తీసి అందులో ఉప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, జీలకర్ర వేసి కలపాలి.
ఇప్పుడు ఒక కొబ్బరి చిప్పను తీసుకుని దానిపై ఉండే పొట్టును చాకు సహాయంతో తీసి వేయాలి. తరువాత దానికి నూనె రాసి పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తగినంత పిండిని తీసుకుని కొబ్బరి చిప్ప మీద ఉంచి వడ ఆకారంలో వత్తుకోవాలి. వానికి మధ్యలో రంధ్రం చేసి నూనెలో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వడలు వేయడం రాని వారు చక్కగా వడలను చేతులు కాల్చుకోకుండా వడలను తయారు చేసుకోవచ్చు. ఈ వడలను మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ వడలను ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. కొబ్బరి చిన్న అందుబాటులో లేని వారు స్టీల్ టీ గంటెతో కూడా ఈ వడలను తయారు చేసుకోవచ్చు.
టీ గంటెను బోర్లించి దానికి తడి చేయాలి. తరువాత దానిపై పిండిని ఉంచి వడలా వత్తుకుని నూనెలో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా చేతులు కాల్చుకునే పని లేకుండా వడలను తయారు చేసుకోవచ్చు. మొదటి సారి చేసే వారు ఈ చిట్కాలను పాటించడం వల్ల చాలా సులభంగా వడలను తయారు చేసుకోవచ్చు.