Dark Circles : సర్వేద్రింయానం నయనం ప్రధానం అని పెద్దలు అంటుంటారు. కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవడం మనందరి బాధ్యత.ఇక ప్రస్తుత కాలంలో చాలా మంది కంటి కింద చర్మం ఉబ్బినట్టుగా ఉంటుంది. దానిని ఐ బ్యాగ్స్ అని అంటారు. నిద్రలేమితో బాధపడే వారిలో, అతిగా టీవీలు చూసే వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వీటి వల్ల నష్టం లేనప్పటికి ముఖం చూడడానికి నీరసంగా, అందవిహీనంగా కనిపిస్తుంది. ఈ ఐ బ్యాగ్స్ ను కొన్ని చిట్కాలను ఉపయోగించి మనం తగ్గించుకోవచ్చు. ముందుగా నీటితో ఉబ్బిన కళ్లను చక్కగా మార్చుకోవడం ఎలాగో తెలుసుకుందాం. నీటితో ఉబ్బిన కళ్లను చక్కగా మార్చుకోవడం చాలా సులభం. వీలైనప్పుడల్లా సాధ్యమైనంతా నీటిని తాగాలి. సహజంగా మన శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.
కానీ కొందరూ నీటిని తక్కువగా తాగుతారు. దీంతో శరీరంలో నీటి శాతం తక్కువై కళ్లు ఉబ్బినట్టు ఉంటాయి. నీటి శాతం తక్కువవడం వల్లే చర్మం పొడిబారినట్టు అవుతుంది. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ ప్రతి గంటకు ఒక గ్లాస్ నీటిని తాగాలి. దీని వల్ల మనం తీసుకున్న ఆహార పదార్థాల్లో ఉండే అధికంగా ఉండే ఉప్పు నుండి మన శరీరం కాపాడబడుతుంది. అలాగే ఉబ్బిన కళ్లను మామూలుగా చేయడంలో టీ బ్యాగ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కళ్లను సంరక్షిస్తాయి. రెండు టీ బ్యాగ్ లను తీసుకుని వాటిని వేడి నీటిలో ఉంచాలి. తరువాత ఒక్కో టీ బ్యాగ్ ను ఒక్కో కంటి మీద 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.
ఇలా ఉబ్బిన కళ్లు మామూలుగా అయ్యే వరకు ఇలా చేస్తూనే ఉండాలి. ఇలా చేయడం వల్ల చాలా త్వరగా కళ్లు మామూలుగా అవ్వడంతో పాటు మరలా కళ్లు ఉబ్బకుండా ఉంటాయి. గుడ్డులోని తెల్లసొనను ఉపయోగించి కూడా ఐ బ్యాగ్స్ ను తగ్గించుకోవచ్చు. గుడ్డులో చర్మాన్ని రక్షించే గుణాలు అధికంగా ఉన్నాయి. దీనికోసం ముందుగా రెండు గుడ్లలోని తెల్లసొనను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ తెల్లసొనను బాగా కలిపి ఒక మెత్తటి బ్రష్ తో తీసుకుని కళ్ల చుట్టూ రాయాలి. ఈ మిశ్రమం పొడి బారేవరకు అలాగే ఉంచాలి. 20 నిమిషాల తరువాత కళ్లను శుభ్రంగా కడగాలి. ఈ విధంగా ప్రతిరోజూ చేయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. ఇక కళ్లను సాధారణ స్థితికి తీసుకురావడంలో కీరదోస ఎంతగానో ఉపయోగపడుతుంది. చర్మాన్ని సంరక్షించడంలో కీరదోస చక్కగా పని చేస్తుంది.
కీరదోసను గుండ్రంగా ముక్కలుగా చేసి కళ్లపై పెట్టుకుని కొద్ది సేపు అలాగే ఉంచడం వల్ల కళ్ల చుట్టూ ఉండే నల్లటి వలయాలు, ముడతలు తొలగిపోతాయి. అదేవిధంగా కలబందను ఉపయోగించి కూడా ఉబ్బిన కళ్లను సాధారణ స్థితికి తీసుకు రావచ్చు. కళ్ల చుట్టూ కలబంద గుజ్జును రాయడం వల్ల ఉబ్బిన కళ్లను మామూలు స్థితికి తీసుకురావచ్చు. ఈ కలబంద గుజ్జును రాయడం వల్ల కళ్ల చుట్టూ నల్లటి మచ్చలు తొలగిపోతాయి. కంటికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. కళ్ల చుట్టూ కలబంద గుజ్జును రాసి 20 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల కళ్లు కాంతివంతంగా తయారవుతాయి. ఈ చిట్కాలను తరచూ వాడడం వల్ల ఉబ్బినట్టుగా ఉండే కళ్లు సాధారణ స్థితికి వస్తాయి. కళ్ల చుట్టూ ఉండే నల్లటి వలయాలు కూడా తొలగిపోతాయి.