Wheat Rava Sweet : గోధుమ రవ్వతో కూడా వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. గోధమ రవ్వతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. గోధుమ రవ్వతో తీపి పదార్థాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా రుచిగా చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోగలిగేలా గోధుమ రవ్వతో స్వీట్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమ రవ్వ స్వీట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎర్ర గోధమ రవ్వ – ఒక కప్పు, నెయ్యి – 4 టేబుల్ స్పూన్స్, డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా, నీళ్లు – 4 కప్పులు, ఉప్పు – పావు టీ స్పూన్, బెల్లం – తురుము – ఒక కప్పు, పంచదార – అర కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్.
గోధుమ రవ్వ స్వీట్ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో గోధుమ రవ్వను తీసుకుని వేడి చేయాలి. దీనిని కలుపుతూ 10 నిమిషాల పాటు వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగిన తరువాత డ్రై ఫ్రూట్స్ ను వేసి వేయించి మరో గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో నీళ్లు పోసి మరిగించాలి. ఇందులోనే ఉప్పును కూడా వేయాలి. నీళ్లు మరిగిన తరువాత వేయించిన గోధుమరవ్వను వేసి ఉండలు లేకుండా కలపాలి. తరువాత దీనిపై మూతను ఉంచి రవ్వను మెత్తగా ఉడికించాలి.
రవ్వ ఉడికిన తరువాత బెల్లం తురుము, పంచదార వేసి కరిగే వరకు కలుపుతూ ఉండాలి. తరువాత దీనిపై మరలా మూతను ఉంచి 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత యాలకుల పొడి, వేయించిన డ్రైఫ్రూట్స్ ను వేసి కలపాలి. చివరగా నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోధమ రవ్వ స్వీట్ తయారవుతుంది. ఈ స్వీట్ తయారీలో పంచదారకు బదులుగా పూర్తిగా బెల్లాన్ని కూడా ఉపయోగించవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు గోధమ రవ్వతో ఎంతో రుచిగా ఉండే ఈ స్వీట్ ను తయారు చేసుకుని తినవచ్చు. ఈ గోధుమ రవ్వ స్వీట్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.