Fenugreek Seeds Water For Hair : ప్రస్తుత తరుణంలో చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అధిక ఒత్తిడి, దీర్ఘకాలిక వ్యాధులు, మెడిసిన్లను అధికంగా వాడడం, పోషకాహార లోపం.. వంటి అనేక కారణాల వల్ల శిరోజాలు రాలిపోతున్నాయి. దీంతో పురుషులకు అయితే బట్టతల వస్తోంది. ఇక స్త్రీలు కూడా జుట్టు రాలిపోతుందని ఆందోళన చెందుతుంటారు. కానీ ఇందుకు సహజసిద్ధమైన ఓ చిట్కా ఉంది. దీన్ని వారంలో రెండు సార్లు పాటిస్తే చాలు.. శిరోజాలు రాలిపోవు.. పెరుగుతాయి. జుట్టు దృఢంగా, ఆరోగ్యంగా కూడా మారుతుంది. ఇక ఆ చిట్కా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
2 టీస్పూన్ల మెంతులను తీసుకుని ఒక గిన్నెలో నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం అందులో మరికాస్త నీళ్లను పోసి సన్నని మంటపై 10 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత నీటిని వడకట్టి అందులో ఒక నిమ్మకాయను పూర్తిగా పిండాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి స్ప్రే బాటిల్‌లో పోసి జుట్టుపై స్ప్రే చేయాలి. జుట్టుపై ఈ మిశ్రమాన్ని స్ప్రే చేస్తూనే బాగా మర్దనా చేయాలి. ఇలా 10 నిమిషాల పాటు చేయాలి. తరువాత 1 గంట పాటు అలాగే ఉండాలి. అనంతరం ఏదైనా ఆయుర్వేదిక్ లేదా హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి.

ఇలా వారంలో కనీసం 2 సార్లు చేయాల్సి ఉంటుంది. ఇక జుట్టు ఎక్కువగా ఉంటే మెంతులను మరొక టీస్పూన్ తీసుకోవచ్చు. ఇలా ఈ చిట్కాను తరచూ పాటించడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయట పడవచ్చు. తల మొత్తం శుభ్రంగా మారుతుంది. చుండ్రు ఉండదు. అలాగే శిరోజాలు పొడవుగా పెరుగుతాయి. దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. మెంతులను ఇలా వాడడం వల్ల జుట్టుకు ఎంతో మేలు జరుగుతుంది. కేవలం ఒక నెల రోజుల పాటు ఇలా చేయడం వల్ల తప్పక ఫలితం కనిపిస్తుంది.