దంతాలను శుభ్రంగా ఉంచుకోకపోతే పసుపుదనం పేరుకుపోతుంది. దీంతో చూసేందుకు దంతాలు అంత చక్కగా కనిపించవు. దంతాలు, చిగుళ్ల ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే దీర్ఘకాలంలో అవి అనేక సమస్యలను కలగజేస్తుంటాయి. నోట్లో బ్యాక్టీరియా పేరుకుపోయి నోరు దుర్వాసన వస్తుంది. అలాగే చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతుంది. దీంతోపాటు దంతాలపై పాచి, గార పేరుకుపోయి చూసేందుకు అందవిహీనంగా కనిపిస్తాయి. కనుక దంతాలను శుభ్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. అయితే కొందరు ఎంత శుభ్రం చేసినా దంతాలపై ఉండే పసుపు దనం పోవడం లేదని వాపోతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. దీంతో పసుపు రంగులో ఉండే దంతాలను తెల్లగా మెరిసేలా మార్చుకోవచ్చు. ఇక అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొద్దిగా పసుపు తీసుకుని అందులో కాస్తంత కొబ్బరినూనె వేసి బాగా కలిపి పేస్ట్‌లా చేయాలి. దీంతో దంతాలను తోముకోవాలి. తరచూ ఇలా చేస్తుంటే దంతాలు, నోరు శుభ్రంగా మారుతాయి. దంతాలు తెల్లగా ఉంటాయి. అలాగే బేకింగ్ సోడా కూడా దంతాలను తెల్లగా మార్చగలదు. బేకింగ్ సోడాను నీటితో కలిపి పేస్ట్‌లా చేసి దాంతో కూడా దంతాలను తోమవచ్చు. బేకింగ్ సోడాలో అవసరం అనుకుంటే కాస్త ఉప్పును కూడా కలుపుకోవచ్చు. ఇక నారింజ పండు తొక్కలు కూడా అద్భుతంగానే పనిచేస్తాయి. ఈ తొక్కలను ఎండబెట్టి పొడి చేయాలి. అందులో కాస్త నీరు కలపాలి. పేస్ట్‌లా చేసి దాంతో దంతాలను తోముకోవాలి. దంతాలు తెల్లగా మెరుస్తాయి. దంతాలపై ఉండే పసుపు దనం పోతుంది.
స్ట్రాబెర్రీలలో విటమిన్ సి, మాలిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి దంతాలు, నోటిని ఆరోగ్యంగా ఉంచుతాయి. స్ట్రాబెర్రీలను పేస్ట్‌లా చేసి దాంతో దంతాలను తోముతుంటే చక్కని ఫలితం ఉంటుంది. ఇలా దంతాలను పసుపు రంగు నుంచి తెల్లగా మార్చుకోవచ్చు. అయితే రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకోవడం, రాత్రి పూట మౌత్ వాష్ తో నోటిని శుభ్రం చేసుకోవడం వంటి అలవాట్లను పాటిస్తే దంతాలు, చిగుళ్లు, నోటిని ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచుకోవచ్చు.