Gas Problem : మనల్ని వివిధ రకాల ఇబ్బందులకు, అసౌకర్యానికి గురి చేసే జీర్ణకోశ సమస్యల్లో గ్యాస్ సమస్య ప్రధానమైనది. కడుపులో ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం అనే సమస్యలు తలెతుత్తాయి. ఆధునిక కాలంలో మారిన జీవన శైలి, వేళకు ఆహారం తీసుకోకపోవడం, తీవ్ర మానసిక ఒత్తిడి, నిద్రలేమి, ఎక్కువ సేపు కదలకుండా ఒకే చోట కూర్చుని పని చేయడం, మసాలా దినుసులను ఎక్కువగా తీసుకోవడం, ఆహారం సరిగ్గా నమిలి తీసుకోకపోవడం వంటి వాటిని గ్యాస్ సమస్య బారిన పడడానికి కారణాలుగా చెప్పవచ్చు.
వీటికి తోడు బీన్స్, చిక్కుళ్లు, క్యాబేజ్, క్యాలిప్లవర్, పాలు, పాల ఉత్పత్తులను అధికంగా తీసుకోవడం, శనగ పిండి వంటకాలు, పప్పు దినుసులు, ద్రాక్ష, ఆపిల్ వంటి పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ సమస్య మరింత జఠిలమవుతుంది. ఘన, ద్రవ పదార్థాలను తీసుకునేటప్పుడు గాలిని మిగడం, మలబద్దకం, వివిధ రకాల అనారోగ్య సమస్యలకు మందులు వాడడం, ప్రేగుల కదలికలు మందగించడం వంటి మొదలైన కారణాల వల్ల కూడా గ్యాస్ సమస్య ఉత్పన్నమవుతుంది. ఈ సమస్య నుండి బయటపడడానికి వివిధ రకాల మందులను, సిరప్ లను వాడే పని లేకుండా మన వంటింట్లో ఉండే పదార్థాలను ఉపయోగించి మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
గ్యాస్ సమస్య నుండి బయట పడడంలో మనుకు నువ్వులు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. నువ్వులను నానబెట్టి మెత్తగా రుబ్బి ఆ మిశ్రమం నుండి పాలను తీయాలి. ఈ పాలలో కొద్దిగా బెల్లాన్ని కలిపి కొద్ది కొద్దిగా తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య నుండి సత్వర ఉపశమనం కలుగుతుందని వారు చెబుతున్నారు. నువ్వుల పాలు మనం తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసి కడుపులో గ్యాస్ ను తయారు కానివ్వకుండా చేస్తాయి. ఈ చిట్కాను పాటించడం వల్ల గ్యాస్ సమస్యతోపాటు కొన్ని ఊపిరితిత్తుల వ్యాధులు కూడా తగ్గుతాయి. ఈ విధంగా నువ్వులు మనకు గ్యాస్ సమస్యను నయం చేయడంలో ఉపయోగపడతాయని ఈ చిట్కాను పాటించడం వల్ల ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.