French Fries : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో బంగాళాదుంపలు కూడాఒకటి. బంగాళాదుంపలను తీసుకోవడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని మనలో చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. బంగాళాదుంపలతో మనం వివిధ రకాల ఆహార పదార్థాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా బంగాళాదుంపలతో రుచిగా, కరకరలాడుతూ ఉండేలా ఫ్రెంచ్ ఫ్రైస్ ను ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
సన్నగా పొడుగ్గా తరిగిన బంగాళాదుంపలు – 4 (పెద్దవి), కార్న్ ఫ్లోర్ – పావు కప్పు, మైదా పిండి – పావు కప్పు, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు తగినంత, నీళ్లు – తగినన్ని, బియ్యం పిండి – పావు కప్పు, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ ను, మైదా పిండి, ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా పలుచగా కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ లో బియ్యం పిండిని తీసుకుని అందులో మిరియాల పొడిని, కొద్దిగాఉప్పును వేసి కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. ఇప్పుడు బంగాళాదుంప ముక్కలను ఒక్కొక్కటిగా తీసుకుని ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమంలో ముంచి తీయాలి. వెంటనే దీనిని బియ్యం పిండిలో వేసి పిండి అంతా ముక్కకు పట్టేలా చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
ఇలా అన్ని బంగాళాదుంప ముక్కలను సిద్దం చేసుకున్న తరువాత వీటిని నూనెలో వేసి వేయించుకోవాలి. ఈ బంగాళాదుంప ముక్కలను మధ్యస్థ మంటపై కరకరలాడే వరకు వేయించుకుని టిష్యూ ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల రుచిగా క్రిస్పీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ తయారవుతాయి. టమాట కెచప్ తో కలిపి తింటే ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. పిల్లలతోపాటు పెద్దలు కూడా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ను ఎంతో ఇష్టంగా తింటారు.