Hair Growth Tip : ప్రస్తుత కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరిని వేధిస్తున్న సమస్యల్లో జుట్టు రాలడం సమస్య కూడా ఒకటి. ఈ సమస్య బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుందనే చెప్పవచ్చు. కారణాలేవైనప్పటికి ఈ సమస్తయో బాధపడే వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. ఒక చిన్న ఇంటి చిట్కాను ఉపయోగించి మనం చాలా సులభంగా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాను వాడడం వల్ల ఇతర జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడంతో పాటు కాంతివంతంగా కూడా తయారవుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గించే ఈ ఇంటి చిట్కాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అలాగే ఈ చిట్కాను ఎలా వాడాలి.. అన్న వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దీని కోసం ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని వేడి చేయాలి. తరువాత ఇందులో గుప్పెడు తాజా కరివేపాకు ఆకులను వేసి మరిగించాలి. కరివేపాకులో ఉండే పోషకాలు తలపై ఉండే మృత కణాలను తొలగించి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ ఇ జుట్టును నల్లగా మార్చడంలో అలాగే జుట్టు కుదుళ్లను బలంగా మార్చడంలో కూడా సహాయపడుతుంది. నీళ్లు మరిగిన తరువాత ఇందులో ఒక టీ స్పూన్ నల్ల జీలకర్రను వేయాలి. ఈ నల్ల జీలకర్రలో మన శరీరానికి అలాగే మన జుట్టుకు అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. జుట్టును నల్లగా మార్చడంలో, జుట్టును తేమగా ఉంచడంలో, జుట్టు రాలడాన్ని తగ్గించడంలో ఈ నల్లజీలకర్ర మనకు ఎంతో దోహదపడుతుంది. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ మెంతులను వేయాలి. మెంతుల్లో ఉండే పోషకాలు జుట్టు రాలడాన్ని తగ్గించడంతో పాటు చుండ్రు సమస్యను, జుట్టు పొడిబారడాన్ని కూడా నివారిస్తాయి.
ఈ నీటిని అర గ్లాస్ అయ్యే వరకు బాగా మరిగించి గోరు వెచ్చగా అయిన తరువాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఒకటి లేదా రెండు టీ స్పూన్ల ఆముదం నూనెను వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ కూడా చేసుకోవచ్చు. అయితే దీనిని వాడే ప్రతిసారి ఇది గోరు వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమంలో దూదిని ముంచి జుట్టు కుదుళ్లకు పట్టేలా బాగా రాయాలి లేదా ఒక స్ప్రే బాటిల్ లో ఈ మిశ్రమాన్ని వేసి జుట్టు కుదుళ్లకు పట్టేలా స్ప్రే చేసుకోవాలి. తరువాత సున్నితంగా మర్దనా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుపై రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు నుండి మూడుసార్లు చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టుకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా తగ్గుతాయి. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.