Potlakaya Masala Curry : మనకు అందుబాటులో ఉన్న వివిధ రకాల కూరగాయల్లో పొట్లకాయలు ఒకటి. ఇవి ఉన్న రూపం కారణంగా వీటిని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ పొట్లకాయలను తినడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. అనేక రకాల పోషకాలను మనం పొందవచ్చు. ఎన్నో వ్యాధులను నయం చేసుకోవచ్చు. అధిక బరువు తగ్గాలనుకునే వారికి, షుగర్, గుండె జబ్బులు ఉన్నవారికి పొట్లకాయ చేసే మేలు అంతా ఇంతా కాదు. అయితే పొట్లకాయ అంటే ఇష్టం లేనివారు దాన్ని మసాలా కూర రూపంలో వండుకుని తినవచ్చు. ఇది అందరికీ నచ్చుతుంది. ఇలా చేస్తే ఇష్టం లేని వారు కూడా తింటారు. ఈ క్రమంలోనే పొట్లకాయ మసాలా కూరను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పొట్లకాయ మసాలా కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసరపప్పు – అర కప్పు, జీలకర్ర – ఒక టీస్పూన్, కరివేపాకు – 2 రెబ్బలు, తరిగిన పచ్చిమిర్చి – 5, పల్లీల పొడి – ఒక టేబుల్ స్పూన్, ఇంగువ – చిటికెడు, ఆవాలు – ఒక టీస్పూన్, ఉల్లి తరుగు – అర కప్పు, ఎండు మిర్చి – 4, ఉప్పు – తగినంత, పొట్లకాయ – 1 (లేతగా ఉన్నది), పసుపు – అర టీస్పూన్.
పొట్లకాయ మసాలా కూరను తయారు చేసే విధానం..
పొట్లకాయను శుభ్రంగా కడిగి మధ్యలోకి నిలువుగా చీల్చి గింజలు తీసేయాలి. చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. ఒక గిన్నెలో పెసర పప్పు, తగినన్ని నీళ్లు పోసి స్టవ్ మీద ఉంచి ఉడికించాలి. కొద్దిగా ఉడకగానే పొట్లకాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించి దింపేయాలి. స్టవ్ మీద పాన్ ఉంచి వేడయ్యాక నూనె వేసి కాగాక ఎండు మిర్చి, ఆవాలు, జీలకర్ర, ఉల్లి తరుగు, పసుపు, ఇంగువ, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు వేసి బాగా వేయించాలి. ఉడికించిన పొట్లకాయ, పెసరపప్పు మిశ్రమం జత చేసి బాగా కలిపి నీరు పోయే వరకు మగ్గబెట్టాలి. పల్లీల పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి దింపేయాలి.
దీంతో ఎంతో రుచికరమైన పొట్లకాయ మసాలా కూర తయారవుతుంది. దీన్ని అన్నం లేదా రోటీలు.. వేటిలోకి అయినా సరే తినవచ్చు. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. పొట్లకాయతో తరచూ చేసే కూరలకు బదులుగా ఇలా వెరైటీగా ఒకసారి మసాలా కూరను చేస్తే అందరూ ఎంతో ఇష్టంగా మొత్తం తినేస్తారు. పొట్లకాయ అంటే ఇష్టం లేనివారు కూడా ఈ కూరను ఇష్టంగా తింటారు. ఈ విధంగా పొట్లకాయలను వండుకుని తిని ప్రయోజనాలను పొందవచ్చు.