యాలకులు భారతీయ సాంప్రదాయ వంటకాలలో అత్యంత ప్రయోజనకరమైన సుగంధ ద్రవ్యం. చూడటానికి చాలా చిన్నదిగా అనిపించినా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. మన వంట ఇంట్లో ఉపయోగించే యాలకులలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని వంటలలో ఉపయోగించడం వల్ల వంటకు రుచిని మాత్రమే కాకుండా, మరింత సువాసన చేకూరుతుంది. అలాగే యాలకులు నోటికి ఫ్రెషనర్ గా కూడా ఉపయోగపడతాయి. అయితే యాలకులలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
1. యాలకులలో ఎన్నో ఔషధగుణాలు దాగి ఉండటం వల్ల ఇది ఒక మంచి టానిక్ గా ఉపయోగపడుతుంది. ఇవి లైంగిక ప్రేరేపణను పెంచుతాయి. యాలకులు శరీరానికి బలాన్ని ఇవ్వడమే కాకుండా పురుషులలో ఉండే నపుంసకత్వ సమస్య నుంచి బయటపడటానికి ఇవి ఎంతగానో దోహదపడతాయి. యాలకులను పాలలో బాగా ఉడికించి అందులో కొంచెం తేనె కలిపి ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు తీసుకోవటంవల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
2. యాలకులు లైంగిక సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా నోటి దుర్గంధ సమస్యను కూడా తొలగిస్తాయి. నోటి దుర్వాసనతో బాధపడేవారికి యాలకులు మంచి ఔషధంలా పనిచేస్తాయి. ప్రతి రోజూ ఆహారం తిన్న తరువాత 2 యాలకులను తినడం ద్వారా లేదా ఒక కప్పు యాలకుల టీ తాగటం వల్ల నోటి దుర్గంధం సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
3. జలుబు సమస్యతో బాధపడేవారు యాలకులను తీసుకోవటం ద్వారా జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. యాలకులు మన శరీరంలో అధిక వేడిని కలిగించి శ్లేష్మంను బయటకు వెళ్లేలా చేస్తాయి. దీంతో జలుబు, ఉబ్బసం మొదలైన శ్వాస సమస్యలు తగ్గుతాయి.
4. చాలామంది గొంతు నొప్పి సమస్యతో బాధపడుతుంటారు. ఉదయం నిద్ర లేవగానే లేదా రాత్రి పడుకునే ముందు యాలకులను నమిలి గోరువెచ్చని నీటిని తాగటం వల్ల గొంతు నొప్పి సమస్య నుంచి పూర్తిగా విముక్తి కలుగుతుంది.