Heat In Body : మనం అనారోగ్యాల బారిన పడడానికి మన శరీరంలో అధికంగా ఉండే వేడి కూడా ఒక కారణం అవుతుంది. వేసవి కాలంలో చాలా మంది శరీరంలో అధిక వేడి సమస్య ను ఎదుర్కొంటుంటారు. కానీ కొందరిలో కాలంతో సంబంధం లేకుండా కూడా ఈ సమస్యతో బాధపడుతుంటారు. శరరీంలో నీటి శాతం తక్కువవడం, జంక్ ఫుడ్ ను అధికంగా తినడం, వేపుళ్లను, నిల్వ పచ్చళ్లను అధికంగా తినడం వంటి కారణాల వల్ల శరీరంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. కొందరిలో మాంసాహారం అధికంగా తినడం వల్ల కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
శరీర ఉష్ణోగ్రత ఉండాల్సి దాని కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మనకు వేడి చేసిన భావన కలుగుతుంది. కళ్లు పొడిబారడం, మల, మూత్ర సమయాల్లో మంట, అరికాళ్లలో మంట, జలుబు చేయడం వంటి లక్షణాలు వేడి చేసినప్పుడు కనిపిస్తాయి. కొన్ని వంటింటి చిట్కాలను ఉపయోగించి మనం శరీరంలో అధికంగా ఉండే వేడిని ఇట్టే తగ్గించుకోవచ్చు. శరీరంలో అధికంగా వేడి ఉన్నప్పుడు పాటించాల్సిన చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేడి చేసి బాధపడుతున్నప్పుడు ఒక గ్లాస్ మజ్జిగలో పంచదారను కలుపుకుని తాగడం వల్ల వెంటనే వేడి తగ్గుతుంది. చాలా మంది మెంతులు వేడి చేస్తాయని భావిస్తారు. కానీ ఇది అవాస్తవం అని నిపుణులు చెబుతున్నారు.
మెంతులను ఏదో ఒక రూపంలో తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రతలు అదుపులో ఉంటాయి. అలాగే వేడి చేసినప్పుడు దానిమ్మ రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దానిమ్మలో వేడిని అదుపు చేసే గుణం ఉంటుంది. రోజూ ఒక గ్లాస్ దానిమ్మ జ్యూస్ ను తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు అదుపులో ఉంటాయి. వేడి చేసినప్పుడు పాలలో తేనెను కలిపి తాగడం వల్ల అధిక వేడి నుండి ఉపశమనం కలుగుతుంది.
శరీరంలో వేడిని తగ్గించడంలో గసగసాలు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ గసగసాల పొడిని తక్కువ మోతాదులో నీటిలో కలుపుకుని తరచూ తాగుతూ ఉండడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. బాగా వేడి చేసినప్పుడు మజ్జిగలో నిమ్మ రసాన్ని, కచ్చా పచ్చాగా దంచిన కరివేపాకును వేసి బాగా కలిపి తాగడం వల్ల వేడి త్వరగా తగ్గుతుంది. నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లను తినడం వల్ల కూడా శరీరం త్వరగా చల్లబడుతుంది. సగ్గు బియ్యం జావలో యాలకులను వేసి కలిపి తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
కలబందను విరిచినప్పుడు వచ్చే ద్రవాన్ని తలమాడుకు, నుదుటికి రాసుకోవడం వల్ల కూడా వేడి తగ్గుతుంది. గంధాన్ని నీటితో అరగదీసి ఆ మిశ్రమాన్ని మాడుకు రాయడం వల్ల కూడా శరీరంలో వేడి అదుపులోకి వస్తుంది. ఈ చిట్కాలను పాటించడంతోపాటు ఎక్కువగా నీటిని తాగుతూ ఉండాలి. మాంసం తినడాన్ని, మద్యం సేవించడాన్ని తగ్గించాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల వేడి తగ్గి శరీరానికి చలువ చేస్తుంది.