భారతీయులకు నెయ్యి అద్భుతమైన సంపద అని చెప్పవచ్చు. నెయ్యిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీని వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అందాన్ని పెంచుకోవచ్చు. పాలతో నెయ్యి తయారవుతుంది, ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఎ, బ్యుటీరిక్ యాసిడ్, ఇతర ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అందువల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థ నుంచి దృఢంగా చేయడంతోపాటు రోగ నిరోధక వ్యవస్థను పటిష్ట పరచడంలో, శరీరానికి కావల్సిన ముఖ్యమైన విటమిన్లను అందించడంలో, వాపులను తగ్గించడంలో నెయ్యి బాగా పనిచేస్తుంది. దీంతో వెంట్రుకలు, చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటాయి. నెయ్యిని ఉపయోగించి పలు ఇంటి చిట్కాల ద్వారా అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. చర్మం, వెంట్రుకల సమస్యలు, జీర్ణ సమస్యలు, ఇతర అనారోగ్యాలను నెయ్యితో తగ్గించుకోవచ్చు. నెయ్యి వల్ల అద్భుతమైన లాభాలు కలుగుతాయి.
జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి నెయ్యి
రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఒక కప్పు వేడి పాలలో ఒకటి లేదా రెండు టీస్పూన్ల నెయ్యి కలిపి తాగాలి. దీంతో మలబద్దకం తగ్గుతుంది. నెయ్యిలో ఉండే బ్యుటీరిక్ యాసిడ్ చిన్నపేగుల గోడలను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో జఠరాగ్ని పెరుగుతుంది. మనం తినే ఆహారంలోని పోషకాలను శరీరం సరిగ్గా గ్రహిస్తుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
ముక్కు దిబ్బడకు
జలుబు, ముక్కు దిబ్బడ వల్ల తీవ్ర అవస్థ పడాల్సి వస్తుంది. దీంతోపాటు ముక్కు కారడం, తుమ్ములు వంటివి వస్తాయి. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. రుచి కోల్పోతారు. తలనొప్పి వస్తుంది. అయితే స్వచ్ఛమైన దేశవాళీ నెయ్యిని వేడి చేసి రెండు చుక్కలను ముక్కు రంధ్రాలు రెండింటిలోనూ వేయాలి. దీంతో ముక్కులోని శ్లేష్మం కరుగుతుంది. ముక్కు దిబ్బడ, జలుబు దగ్గుతాయి. ఉదయాన్నే ఇలా చేయాలి. దీనివల్ల తక్షణమే ఉపశమనం లభిస్తుంది. నాసికా మార్గాల్లో ఉండే అడ్డంకులు పోతాయి. శ్వాస సరిగ్గా ఆడుతుంది.
పొట్ట దగ్గరి కొవ్వును కరిగించేందుకు
నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, శరీరానికి అవసరం అయిన అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి కొవ్వు కణాలపై పనిచేస్తాయి. కొవ్వు కణాలను తగ్గిస్తాయి. నెయ్యిలో ఉండే ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు కొవ్వును కరిగించడంలో సహాయ పడతాయి. రోజూ ఆహారంలో ఒక టీస్పూన్ నెయ్యిని తీసుకోవాలి. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. ఆహారంలోని పోషకాలను శరీరం సరిగ్గా గ్రహిస్తుంది. అది అధిక బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.
డయాబెటిస్ ఉన్నవారికి
డయాబెటిస్ ఉన్నవారు అన్నం, గోధుమ రొట్టెలు తినలేరు. ఎందుకంటే అవి అనారోగ్యకరమైనవి. అవి ఎక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) విలువ కలిగిన ఆహారాలు. అంటే వాటిని తిన్నవెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. దీంతో వాటిని తినలేరు. అయితే అన్నం, చపాతీలు, పరోటాలపై నెయ్యి వేసి తీసుకుంటే వాటి గ్లైసీమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. కనుక రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగవు. అలాగే తిన్న ఆహారాలు సరిగ్గా జీర్ణమవుతాయి.
చర్మ సంరక్షణకు
చర్మ సంరక్షణకు నెయ్యి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ముఖ్యమైన ఫ్యాటీ యాసిడ్లు చర్మాన్ని సంరక్షిస్తాయి. చర్మం కాంతివంతంగా ఉండేలా చూస్తాయి. నిర్జీవమైన చర్మం కలిగిన వారికి నెయ్యి బాగా ఉపయోగపడుతుంది. అన్ని రకాల స్కిన్ టైప్‌లకు నెయ్యి పనిచేస్తుంది. నెయ్యితో ఫేస్ మాస్క్‌ను తయారు చేసి ఉపయోగించవచ్చు. దీంతో చర్మం సురక్షితంగా ఉంటుంది.
కావల్సిన పదార్థాలు
- నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
- శనగపిండి – 2 టేబుల్ స్పూన్లు
- పసుపు – ఒక టీస్పూన్
- నీళ్లు – తగినన్ని
తయారు చేసే విధానం
అన్ని పదార్థాలను బాగా కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. మిశ్రమం పొడిగా ఉండకుండా ద్రవరూపంలో ఉండేలా చూసుకోవాలి. అన్నింటినీ బాగా కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. అనంతరం ఆ పేస్ట్‌ను మాస్క్ రూపంలో ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత చల్లని నీటితో కడిగేయాలి. వారంలో రెండు సార్లు ఇలా చేస్తే చక్కని ఫలితం ఉంటుంది. చర్మం ప్రకాశిస్తుంది. అందంగా కనిపిస్తుంది.
వెంట్రుకలకు
పొడిబారిన, చిట్లిపోయిన వెంట్రుకలకు నెయ్యి ఎంతగానో ఉపయోగపడుతుంది. నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు శిరోజాలను సంరక్షిస్తాయి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్‌ను కలిపి మిశ్రమంగా చేసి జుట్టుకు బాగా రాయాలి. 20 నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేయాలి. దీంతో జుట్టు చక్కని కండిషన్‌లో ఉంటుంది. మృదువుగా మారుతుంది. ఆ మిశ్రమంలో అవసరం అనుకుంటే నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. దీంతో చుండ్రు తగ్గుతుంది. అయితే జుట్టు కుదుళ్లకు తగిలేలా ఆ మిశ్రమాన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. దీంతో అద్భుతమైన ఫలితాలు వస్తాయి.
పొడిబారి, పగిలిన పెదవులకు
మన శరీరంలో అనేక అవయవాలను చాలా మంది సురక్షితంగా ఉంచుకుంటారు. కానీ పెదవుల సంరక్షణ పట్ల నిర్లక్ష్యం వహిస్తారు. పెదవులు సహజసిద్ధంగానే పింక్ రంగులో ఉంటాయి. కానీ కాలుష్యం వల్ల వాటి రంగు మారుతుంది. అలాగే సూర్య కిరణాలు, దుమ్ము, పొగ కూడా పెదవుల రంగు మారేందుకు కారణం అవుతుంటాయి. అయితే కొద్దిగా నెయ్యిని వేడి చేసి పెదవులపై అప్లై చేయాలి. రాత్రి నిద్రించే ముందు ఇలా చేయాలి. మరుసటి రోజు ఉదయాన్నే పెదవులపై పొడి కణాలు కనిపిస్తాయి. వాటిని స్క్రబ్ చేసి తొలగించాలి. దీంతో పెదవులు మృదువుగా మారుతాయి. సహజసిద్ధమైన రంగును పొందుతాయి. ఇలా రోజూ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
నెయ్యి వల్ల ఏయే సమస్యల నుంచి బయట పడవచ్చో ఇప్పుడు తెలుసుకున్నారు కదా. అయితే నెయ్యి వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలిగే మాట వాస్తవమే అయినా నెయ్యిని అధికంగా తీసుకోరాదు. తక్కువ మోతాదులో తీసుకోవాలి. నెయ్యిలో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అందువల్ల నెయ్యిని అధికంగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు తగ్గకపోగా ఇంకా ఎక్కువయ్యేందుకు అవకాశం ఉంటుంది. కనుక నెయ్యిని రోజూ స్వల్ప మోతాదులో తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.