మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ.. లేదా సాధారణ జ్వరం.. ఇలా ఏ జ్వరం వచ్చినా సరే తగ్గేందుకు వ్యాధిని బట్టి కొన్ని రోజుల సమయం పడుతుంది. జ్వరం తగ్గాక నోరు అంతా చేదుగా ఉంటుంది. అందుకు పలు కారణాలు ఉంటాయి. జ్వరం వచ్చినప్పుడు మింగే మందుల వల్ల నోరు అంతా అలా చేదుగా ఉంటుంది. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల ఆ చేదును సులభంగా తగ్గించుకోవచ్చు. మరి అందుకు ఏం చేయాలంటే..
* జ్వరం తగ్గాక నోట్లో ఉండే చేదును పోగొట్టుకునేందుకు పుదీనా ఆకులు బాగా పనిచేస్తాయి. పుదీనా ఆకును 3-4 తీసుకుని బాగా కడిగి నోట్లో వేసుకుని నమిలి మింగాలి. దీంతో నోటికి రుచి తెలుస్తుంది. చేదు తగ్గుతుంది.
* పుదీనా ఆకులే కాక కొత్తిమీర ఆకులను కూడా వాడవచ్చు. వాటిని నమిలి మింగినా చేదు పోతుంది.
* వెల్లుల్లి, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, ఉల్లిపాయ వంటి వాటిని వేసి ఏదైనా పచ్చడి చేసుకుని తింటుండాలి. నోట్లో చేదు తగ్గుతుంది.
* నోట్లో చేదును తగ్గించుకునేందుకు మిరియాల రసం కూడా పనిచేస్తుంది. బాగా ఘాటుగా ఉండేలా తయారు చేయాలి. మిరియాల రసంతో అన్నం తింటే రుచి తెలుస్తుంది.
* పండు మిరపకాయలు, గోంగూర వంటి పచ్చళ్లను తింటున్నా రుచి తెలుస్తుంది.
* ఆల్‌బుకరా కాయల గురించి తెలుసు కదా. ఇవి రెండు రకాలుగా మనకు లభిస్తాయి. నేరుగా పండ్లను తినవచ్చు. లేదా సూపర్ మార్కెట్‌లో డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ వీటిని విక్రయిస్తారు. వీటిని తింటున్నా నోట్లో చేదు తగ్గుతుంది. రుచి తెలుస్తుంది.
* ఒక టీస్పూన్ అల్లం రసంలో అంతే మోతాదులో తేనె కలిపి ఉదయాన్నే పరగడుపునే తీసుకోవాలి. లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను కూడా తినవచ్చు. దీని వల్ల చేదు తగ్గి రుచి తెలుస్తుంది.