Dandruff : మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో చుండ్రు సమస్యతో బాధపడుతూనే ఉంటారు. తలలో చుండ్రు రాగానే దురద, తెల్లటి పొట్టు రాలడం వంటివి జరుగుతూ ఉంటాయి. జుట్టు ఎంత నల్లగా, ఒత్తుగా ఉన్నప్పటికీ చుండ్రు కారణంగా అందంగా కనిపించదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. చుండ్రు సమస్య తలెత్తడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఖరీదైన షాంపూలను వాడినప్పటికీ ఈ చుండ్రు సమస్య నుండి ఉపశమనం లభించని వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు.
మన ఇంట్లో ఉండే పదార్థాలను ఉపయోగించి తలలో ఉండే చుండ్రును నివారించుకోవచ్చు. చుండ్రును నివారించే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో మెంతులను వేసి నానబెట్టాలి. తరువాత ఈ మెంతులను జార్ లో వేసి పేస్ట్ గా చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అందులో నిమ్మరసం, కొబ్బరి నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు తలకు పట్టించి ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గడంతోపాటు జుట్టు కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది.
అలాగే చుండ్రు సమస్యను నివారించడంలో యాపిల్ సైడ్ వెనిగర్ కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ లో కొద్దిగా నీటిని కలపాలి. ఈ మిశ్రమంలో దూదిని ముంచి దానితో తలపై రాయాలి. ఇలా రాత్రి పడుకునే ముందు తలకు రాసి ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు తొలగిపోతుంది. మనం నోటిని శుభ్రం చేసుకోడానికి ఉపయోగించే మౌత్ వాష్ తో కూడా మనం చుండ్రు సమస్యను నివారించుకోవచ్చు.
ఆల్కాహాల్ ఉండే మౌత్ వాష్ ను తీసుకుని జుట్టుకు కండిషనర్ గా ఉపయోగించడం వల్ల కూడా చుండ్రు తొలగిపోతుంది. చుండ్రు సమస్యతో బాధపడే వారికి పుదీనా ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ ఆకులను పేస్ట్ గా చేసి తలకు పట్టించడం వల్ల కూడా చుండ్రు తొలగిపోతుంది. అలాగే చుండ్రును నివారించడంలో వెల్లులి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. వెల్లులి రెబ్బలను పేస్ట్ గా చేసి తలకు పట్టించాలి. ఇలా చేసిన గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా చుండ్రు సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది.
మనం తరచూ ఉపయోగించే షాంపూలో రాళ్ల ఉప్పును కలిపి తలకు రాసి మర్దనా చేసి తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా చుండ్రు తొలగిపోతుంది. అదే విధంగా పుల్లటి పెరుగులో నిమ్మరసం కలిపి తలకు పట్టించాలి. ఇలా చేసిన గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల చుండ్రుతో పాటు చుండ్రు వల్ల వచ్చే దురదలు కూడా తగ్గుతాయి. ఆలివ్ నూనెను తలస్నానం చేయడానికి అర గంట ముందు తలకు రాసి మర్దనా చేయాలి. వేడి నీటితో తడిపిన టవల్ ను తలకు చుట్టాలి. అర గంట తరువాత తలస్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల కూడా చుండ్రు సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది.
అదే విధంగా కోడిగుడ్డులో నిమ్మరసం కలిపి తలకు పట్టించాలి. ఈ మిశ్రమం ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా చుండ్రు సమస్య తగ్గడంతోపాటు జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. వేపాకు కూడా చుండ్రు సమస్యను నయం చేయడంలో ఉపయోగపడుతుంది. ముందుగా వేపాకును పేస్ట్ గా చేయాలి. తరువాత ఇందులో కొబ్బరి నూనెను వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ఆరిన తరువాత తలస్నానం చేయాలి. చుండ్రు సమస్యతో బాధపడుతున్న వారు ఈ చిట్కాలను పాటించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చాలా తక్కువ ఖర్చులోనే చుండ్రు సమస్య నుండి బయట పడవచ్చు.