Chicken Pepper Fry : చికెన్ ను తినడానికి ఇష్టపడే వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. చికెన్ తో వివిధ రకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా చికెన్ తో రుచిగా చికెన్ పెప్పర్ ఫ్రై ని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ పెప్పర్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – ఒక కిలో, ఉప్పు – తగినంత, నిమ్మరసం – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, గరం మసాలా పొడి – 2 టీ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పెరుగు – అర కప్పు, నూనె – 5 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 4, కరివేపాకు – కొద్దిగా, మిరియాల పొడి – అర టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి – రెండు టేబుల్ స్పూన్స్.
చికెన్ పెప్పర్ ఫ్రై తయారీ విధానం..
ముందుగా ఉప్పు, నిమ్మరసం వేసి చికెన్ ను బాగా శుభ్రపరుచుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అందులో ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత నిమ్మరసం, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూతను ఉంచి డీప్ ఫ్రిజ్ లో ఒక గంట పాటు ఉంచాలి. ఇలా ఒక గంట పాటు మారినేట్ చేసుకున్న తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తరువాత చికెన్ ను, కరివేపాకును వేసి కలపాలి. ఇప్పుడు కళాయిపై మూతను ఉంచి చిన్న మంటపై చికెన్ లోని నీరు అంతా బయటకు వచ్చే వరకు వేయించాలి. తరువాత మంటను మధ్యస్థంగా ఉంచి మరో 15 నిమిషాల పాటు వేయించాలి. ఇలా వేయించిన తరువాత కలుపుతూ డ్రై అయ్యే వరకు వేయించాలి. తరువాత మిరియాల పొడి, ఎండు కొబ్బరి పొడి వేసి కలపాలి. దీనిని మరో 3 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రుచిగా ఉండే చికెన్ పెప్పర్ ఫ్రై తయారవుతుంది. దీనిని నేరుగా ఉల్లిపాయతో లేదా పప్పు, సాంబార్ వంటి వాటితో కలిపి తినవచ్చు. ఈ చికెన్ పెప్పర్ ఫ్రైని కూడా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.