ఆకలి బాగా తగ్గిపోయిందా ? ఈ సులభమైన చిట్కాలను పాటించండి..!

ఆకలి తగ్గిపోవడం అన్నది దాదాపుగా ప్రతి ఒక్కరికీ ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే సమస్యే. అయితే ఈ సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చు. ఆకలి తగ్గితే ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్‌ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే డెమెంటియా, కిడ్నీ సమస్యలు, బాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు వంటి సమస్యలు కూడా వస్తాయి. ఆకలి తగ్గిపోవడం వల్ల కొందరు బరువును వేగంగా కోల్పోతారు. అయితే ఈ సమస్య నుంచి బయట పడాలంటే అందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. అవేమిటంటే…

home remedies to increase appetite

1. నల్ల మిరియాలను ఎంతో పురాతన కాలం నుంచి ఆయుర్వేద వైద్య విధానంలో చికిత్సలకు ఉపయోగిస్తున్నారు. ఇవి జీర్ణశక్తిని పెంచి ఆకలి బాగా అయ్యేలా చేస్తాయి. మిరియాలను తీసుకోవడం వల్ల గ్యాస్‌ సమస్యలు తగ్గుతాయి. వీటిల్లో ఉండే ఔషధ గుణాలు రుచికళికలను ప్రభావితం చేస్తాయి. దీంతో జీర్ణాశయంలో యాసిడ్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా జీర్ణశక్తి మెరుగు పడుతుంది. ఒక టీస్పూన్‌ బెల్లం పొడి, అర టీస్పూన్‌ మిరియాల పొడిని కలిపి రోజూ ఒక్కసారి తీసుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే ఫలితం ఉంటుంది.

2. అనేక రకాల వంటల్లో మనం అల్లంను వాడుతుంటాం. ఇందులో ఔషధ గుణాలు కూడా ఉంటాయి. అజీర్ణ సమస్య నుంచి బయట పడేసి ఆకలిని పెంచడంలో అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. అల్లంను తీసుకోవడం వల్ల కడుపు నొప్పి తగ్గుతుంది.

3. సైంధవ లవణంను చిటికెడు మోతాదులో తీసుకుని అందులో అర టీస్పూన్‌ అల్లం రసం కలిపి రోజూ ఉదయం, సాయంత్రం భోజనానికి గంట ముందు తీసుకోవాలి. ఇలా పది రోజుల పాటు చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే అల్లంతో తయారు చేసే టీ ని కూడా తాగవచ్చు.

4. జీర్ణ సమస్యల వల్ల కొందరికి ఆకలి తగ్గిపోతుంది. అలాంటి వారికి ఉసిరి ఎంతగానో మేలు చేస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరును ఇది మెరుగు పరుస్తుంది. లివర్‌లోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. ఇందులో ఉండే విటమిన్‌ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రెండు టీస్పూన్ల ఉసిరికాయ రసం, ఒక టీస్పూన్‌ తేనె, ఒక టీస్పూన్‌ నిమ్మరసంలను ఒక కప్పు నీటిలో బాగా కలిపి రోజూ ఉదయాన్నే పరగడుపునే తీసుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే ఆకలి పెరుగుతుంది.

5. జీర్ణరసాలను బాగా ఉత్పత్తి చేసి ఆకలిని పెంచడంలో యాలకులు కూడా బాగానే పనిచేస్తాయి. రోజూ ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు రెండు లేదా మూడు యాలకులను అలాగే నమిలి మింగాలి. దీంతో ఆకలి పెరుగుతుంది. అలాగే యాలకులతో డికాషన్‌ తయారు చేసి కూడా తాగవచ్చు. దీంతోనూ ఫలితం ఉంటుంది.

6. దాదాపుగా అన్ని రకాల జీర్ణ సమస్యలను తగ్గించడంలో వాము అద్భుతంగా పనిచేస్తుంది. జీర్ణాశయంలో చేరే ఆహారాన్ని జీర్ణం చేసేందుకు అవసరం అయ్యే ఎంజైమ్‌లు, యాసిడ్లు ఉత్పత్తి అయ్యేందుకు వాము ఉపయోగపడుతుంది. రెండు లేదా మూడు టీస్పూన్ల వామును కొద్దిగా నిమ్మరసంలో కలపాలి. దీంతో ఆ మిశ్రమం కొంతసేపటికి పొడిగా మారుతుంది. తరువాత అందులో కొద్దిగా నల్ల ఉప్పు కలపాలి. ఆ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు గోరు వెచ్చని నీటితో తీసుకోవాలి. దీంతో ఆకలి పెరుగుతుంది. అలాగే భోజనానికి ముందు అర టీస్పూన్‌ వామును అలాగే నమిలి తినాలి. దీంతోనూ ఆకలిని పెంచుకోవచ్చు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts