Honey : తేనె అంటే అందరికీ ఇష్టమే. ఇది మనకు ప్రకృతిలో అత్యంత సహజసిద్ధంగా లభించే పదార్థాల్లో ఒకటి. స్వచ్ఛమైన తేనె ఎప్పటికీ అలాగే నిల్వ ఉంటుంది. ఎన్ని ఏళ్లు గడిచినా పాడవదు. ఆయుర్వేదంలోనూ తేనెకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారు. తేనెలో అనేక పోషకాలతోపాటు ఔషధ గుణాలు దాగి ఉంటాయి. అందువల్ల తేనె పలు అనారోగ్య సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే తేనెను ఉపయోగించి పలు అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. అందుకు తేనెను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఒక టేబుల్ స్పూన్ తేనె, అంతే మోతాదులో నిమ్మరసం తీసుకుని కలిపి ఆ మిశ్రమాన్ని రోజుకు 3 సార్లు తీసుకోవాలి. దీంతో జలుబు తగ్గుతుంది.
2. రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌లో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి రోజుకు 2 సార్లు తీసుకోవాలి. దీంతో సైనస్ సమస్య నుంచి బయట పడవచ్చు.
3. తేనె 8 టీస్పూన్లు, నిమ్మరసం 4 టీస్పూన్లు తీసుకుని కలిపి రోజుకు 3 సార్లు తీసుకోవాలి. దగ్గు తగ్గుతుంది.
4. ఏదైనా హెర్బల్ టీలో 2 టీస్పూన్ల తేనె కలిపి రోజుకు 2 సార్లు తాగుతుండాలి. దీంతో శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. ఆరోగ్యంగా ఉండవచ్చు.
5. ఒక టీస్పూన్ తేనె, అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని తీసుకుని కలిపి రోజుకు 2 సార్లు తీసుకోవాలి. అధిక బరువు తగ్గుతారు.
6. ఒక టీస్పూన్ దాల్చినచెక్క పొడి, ఒక టేబుల్ స్పూన్ తేనెలను కలిపి దంతాలపై నొప్పి ఉన్న చోట రాయాలి. దీంతో దంతాల నొప్పి తగ్గుతుంది. చిగుళ్ల సమస్యలు కూడా తగ్గుతాయి.