కరోనా కారణంగా చాలా మంది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే వారు అనేక రకాల ఆహారాలను రోజూ తీసుకుంటున్నారు. అయితే రోగ నిరోధక శక్తిని పెంచేందుకు మన వంట ఇళ్లలో ఉండే మసాలా దినుసులు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని రోజూ వాడడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా ఉంటాయి. వైరస్‌లు, బాక్టీరియాల నుంచి శరీరానికి రక్షణ లభిస్తుంది. మరి ఆ మసాలా దినుసులు ఏమిటంటే…
ఇంగువ
భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఇంగువను ఉపయోగిస్తున్నారు. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇంగువలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ బయోటిక్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అనేక అనారోగ్యాలకు కారణమయ్యే ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. ఇంగువను తీసుకోవడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, నొప్పులు తగ్గుతాయి. రోజూ వంటల్లో ఇంగువను ఉపయోగించడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
పసుపు
పసుపులో కర్‌క్యుమిన్ అనబడే సమ్మేళనం ఉంటుంది. ఇది నొప్పులను నివారిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలిపి రోజూ రాత్రి నిద్రించే ముందు తాగాలి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
మిరియాలు
జీర్ణ సమస్యలను తగ్గించడంలో మిరియాలు బాగా పనిచేస్తాయి. వీటిల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి జ్వరాన్ని తగ్గిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. రోజూ రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా మిరియాల పొడిని కలుపుకుని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు రాకుండా ఉంటాయి.
లవంగాలు
లవంగాల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీర్యాడికల్స్‌తో పోరాడుతాయి. రోగ నిరోధక శక్తి పెరిగేందుకు తోడ్పడుతాయి. గోరు వెచ్చని పాలలో లవంగాల పొడి కొద్దిగా కలిపి తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
మెంతులు
కొలెస్ట్రాల్, షుగర్ లెవల్స్ ను తగ్గించడంలో మెంతులు అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాదు, ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. రోజూ రాత్రి నీటిలో గుప్పెడు మెంతులను నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే ఆ మెంతులను తినాలి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. లేదా మెంతుల పొడిని మజ్జిగలో కలుపుకుని కూడా తాగవచ్చు.
దాల్చిన చెక్క
దాల్చిన చెక్కలో మాంగనీస్, కాల్షియం, ఫైబర్, ఐరన్‌లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దాల్చిన చెక్కలో యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. దాల్చిన చెక్కతో చేసిన కషాయాన్ని రోజూ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365