Prickly Heat : వేసవి కాలంలో మన శరీరం సహజంగానే వేడిగా మారుతుంటుంది. దీంతో శరీరాన్ని చల్లబరిచేందుకు శ్వేద గ్రంథులు చెమటను అధికంగా ఉత్పత్తి చేస్తుంటాయి. దీని వల్ల శరీరం చల్లగా మారుతుంది. మనకు వేసవి తాపం తగ్గుతుంది. ఎండ దెబ్బ బారిన పడకుండా శరీరం చల్లగా ఉంటుంది. ఇదంతా సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియే. అయితే ఈ ప్రక్రియలో కొందరికి వేడి మరీ అధికంగా ఉండడం వల్ల చెమట కాయలు ఏర్పడుతుంటాయి. మెడపై, గొంతు కింది భాగంలో, వీపు మీద చెమట కాయలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే కొన్ని సహజసిద్ధమైన పద్ధతులను పాటించడం ద్వారా చెమటకాయల సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. మరి అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. వట్టి వేరు చూర్ణాన్ని కాస్తంత తీసుకుని స్నానం చేసే నీటిలో వేయాలి. ఒక గంట సేపు అయ్యాక స్నానం చేయాలి. ఇలా రోజూ చేస్తుంటే శరీరం చల్లబడడమే కాదు.. చెమటకాయలు కూడా తగ్గుతాయి. అయితే వట్టివేరుకు బదులుగా సన్నజాజి లేదా మల్లె పువ్వులను కూడా వేయవచ్చు. వీటిని వేసినా ఒక గంట సేపు అయ్యాకే ఆ నీటితో స్నానం చేయాలి. దీంతో చెమటకాయల నుంచి ఉపశమనం లభిస్తుంది.
2. చెమట కాయలు ఉన్న ప్రదేశంలో కలబంద గుజ్జును రాయాలి. సున్నితంగా మర్దనా చేయాలి. తరువాత ఒక గంట సేపు ఆగి స్నానం చేయాలి. ఇలా రోజుకు ఒకసారి చేస్తే ఐదారు రోజుల్లో చెమట కాయలు పూర్తిగా తగ్గిపోతాయి. కలబంద గుజ్జుకు బదులుగా రోజ్ వాటర్‌ను కూడా ఉపయోగించవచ్చు. అలాగే ముల్తానీ మట్టి కూడా బాగానే పనిచేస్తుంది. దీన్ని నీటితో కలిపి పేస్ట్‌లా చేసి ఆ మిశ్రమాన్ని చెమటకాయలపై రాయాలి. తరువాత గంట ఆగి స్నానం చేయాలి. దీంతో చెమటకాయలు తగ్గుతాయి.
3. మార్కెట్‌లో మనకు గంధం చెక్కలు లేదా పొడి లభిస్తాయి. గంధం చెక్క అయితే దాన్ని నీళ్లతో అరగదీస్తూ గంధం తీయాలి. దాన్ని చెమటకాయలపై రాయాలి. తరువాత కొంత సేపు ఆగి స్నానం చేయాలి. లేదంటే గంధం పొడిలో కొన్ని నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసి ఆ మిశ్రమాన్ని కూడా ఉపయోగించవచ్చు. దీంతో చెమట కాయల నుంచి విముక్తి లభిస్తుంది.
4. ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని మిక్సీలో వేసి పేస్ట్‌లా చేయాలి. అనంతరం ఆ పేస్ట్ ను ఒక వస్త్రంలో ఉంచి దాన్ని మూటలా చుట్టి బాగా పిండుతూ రసం తీయాలి. ఈ రసాన్ని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని దానికి అంతే మోతాదులో నెయ్యి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చెమటకాయలపై రాయాలి. తరువాత గంట సేపు ఆగి స్నానం చేయాలి. దీంతో చెమట కాయలు త్వరగా పోతాయి. దురద, మంట నుంచి సత్వరమే ఉపశమనం లభిస్తుంది.
5. ముదురు పింక్ రంగులో ఉండే గులాబీ పువ్వుల రెక్కలను సేకరించి వాటిని దంచి పేస్ట్‌లా చేయాలి. ఆ పేస్ట్‌ను చెమటకాయలు ఉన్న చోట రాయాలి. గంట సేపు అయ్యాక స్నానం చేయాలి. దీని వల్ల కూడా చెమట కాయలు తగ్గుతాయి.