Tandoori Tea : మనం ఇంట్లో కాఫీ, టీలను రోజూ తయారు చేసుకుని తాగుతుంటాం. బయటకు వెళ్తే వెరైటీ కాఫీ, టీలు మనకు లభిస్తాయి. ఇక మట్టి ముంతల్లో అందించే తందూరీ టీ ని కూడా చాలా మంది రుచి చూసి ఉంటారు. ఇది ఎంతో అద్భుతమైన టేస్ట్‌ను కలిగి ఉంటుంది. అయితే దీన్ని ఇంట్లోనే మీరు సులభంగా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
తందూరీ టీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – రెండు కప్పులు, టీ పొడి – రెండు టీస్పూన్లు, యాలకులు – నాలుగు, అల్లం ముక్క – చిన్నది, చక్కెర – మూడు టీస్పూన్లు, పాలు – ఒక కప్పు.
తందూరీ టీ ని తయారు చేసే విధానం..
స్టవ్ వెలిగించి గిన్నెలో నీళ్లు పోసి మరిగించాలి. అందులో కచ్చా పచ్చాగా దంచిన యాలకులు, అల్లం తరుగు వేసి రెండు నిమిషాల పాటు మరిగించాలి. దీనికి టీ పొడిని జత చేయాలి. అది మరుగుతున్నప్పుడు పాలు కలపాలి. ఒక పొంగు వచ్చాక స్టవ్ చిన్నగా చేసి చక్కెర వేసి కలపాలి. రెండు మూడు నిమిషాల పాటు చిన్నమంటపై మరిగించాలి. దీన్ని ఒక పాత్రలోకి తీసుకుని వడకట్టుకోవాలి. మరో పొయ్యి మీద చిన్నపాటి జాలీ పెట్టి దానిపై బొగ్గులను వేడి చేయాలి. ఈ బొగ్గులపై టీ తాగే ముంతను బాగా కాల్చాలి. బొగ్గులు అందుబాటులో లేకపోతే ముంతను నేరుగా స్టవ్‌పై పెట్టి కూడా వేడి చేయవచ్చు. ఇప్పుడు ఈ వేడి వేడి ముంతలో టీ పోసి తాగితే.. అదరిపోయే రుచి వస్తుంది. ఎంతో టేస్ట్‌గా ఉంటుంది. బయట తాగే తందూరీ టీ లాగే రుచి ఉంటుంది. ఇలా తందూరీ టీని మీరు మీ ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.