నిద్రలో గురక పెట్టే అలవాటు చాలా మందిలో ఉంటుంది. ఈ గురక వలన పక్కన వారు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముప్పయి ఏళ్లలోపువారిలో సుమారు 10% మంది.. 60 ఏళ్లు దాటినవారిలో 60% మంది గురక పెడుతుంటారు. ప్రతి ముగ్గురు పురుషులలో ఒకరికి, ప్రతి నలుగురు స్త్రీలలో ఒకరికి రాత్రి గురక పెట్టే అలవాటు ఉంటుందని ఓ సర్వే ద్వారా నిర్ధారణ అయింది. ఏ సమస్య లేకపోయినా గురక వచ్చే వారు కూడా ఉన్నారు. అయితే ఎక్కువ సేపు గురక పెట్టేవారిలో.. శ్వాస ఆగిపోవడం, హృదయ సంబంధ వ్యాధులు వచ్చే సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకే గురకని నిర్లక్ష్యం చేయకుండా కొన్ని చిట్కాలతో తగ్గించుకుంటే మంచిది.
రాత్రిపూట నిద్ర పోయే ముందు గోరువెచ్చని గ్లాసు నీళ్ళలో కొద్దిగా యాలకుల పొడి కలుపుకుని తాగితే గురక నిదానంగా తగ్గుతుంది. నిద్ర పోయే ముందు ఒక చెంచా తేనెలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలుపుకొని తీసుకోవడం వల్ల కూడా విపరీతమైన గురక నుండి ఉపశమనం లభిస్తుంది. పెప్పర్మింట్ ఆయిల్ ను చేతికి రాసుకుని రాత్రి పడుకునే ముందు బాగా వాసన చూస్తే కూడా గురక తగ్గుతుంది. ఆలివ్ ఆయిల్‌లోని ఔషధ గుణాల గురించి మనందరికీ తెలుసు. ఇది చర్మానికి ఉత్తమమైన మాయిశ్చరైజర్. అయితే ఆలివ్ ఆయిల్ గురకను కూడా తొలగిస్తుందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. రాత్రి పడుకునేటప్పుడు ఈ నూనెను కొన్ని చుక్కలు ముక్కులో వేస్తే వాపులు తొలగిపోయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండదు.
అల్లం తీసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. కడుపు నొప్పి, దగ్గు, గుండె సమస్యలు, జలుబు.. ఇలా ఎన్నో సమస్యలను నయం చేయగాల సూపర్ ఫుడ్ అల్లం. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ ఏజెంట్స్ ఉంటాయి. ఇది గొంతును క్లియర్ చేస్తుంది. గురక నుంచి ఉపశమనం పొందడానికి.. రోజుకు రెండు సార్లు అల్లం, తేనె టీ తాగితే మంచిది. వెల్లుల్లి, ఉల్లిపాయ, ముల్లంగి.. తీసుకుంటే గురక సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. వెల్లుల్లి రసం వలన గురకని తగ్గించవచ్చు.గురక సమస్య నుంచి ఉపశమనం పొందడానికి.. ఆవు, గెదె పాలు తీసుకోవడం మానేసి.. సోయా పాలు తీసుకుంటే మంచిది.రాత్రి భోజనంలో పచ్చి ఉల్లిపాయ తింటే కొంత గురక సమస్య నుండి ఉపశమనం దక్కుతుందని చెబుతున్నారు. ప్రతిరోజూ కొద్దిగా పచ్చి అటుకులు తినడం వల్ల కూడా గురక సమస్య నుండి ఉపశమనం లభిస్తుందని అంటున్నారు.