Hiccups : మనకు అప్పుడప్పుడూ ఉన్నట్టుండి వెక్కిళ్లు వస్తూ ఉంటాయి. వెక్కిళ్లు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. భోజనాన్ని త్వరత్వరగా తినడం వల్ల, శరీరంలో ఉష్ణోగ్రతలు మారడం వల్ల, గొంతు నొప్పి కారణంగా, పొట్టలో గ్యాస్ వల్ల, శ్వాసకోస సంబంధిత సమస్యలతో, మూత్ర పిండాల సంబంధిత సమస్యలతో బాధపడుతుండడం వల్ల, అధికంగా తినడం వల్ల, ఎక్కువ సంతోషానికి గురి అవ్వడం వల్ల, ఎక్కువగా నవ్వడం వల్ల, ఎక్కువగా ఏడవడం వల్ల ఇలా అనేక కారణాల వల్ల మనకు వెక్కిళ్లు వస్తూ ఉంటాయి.
సాధారణంగా వెక్కిళ్లు 5 నుండి 10 నిమిషాల్లోనే తగ్గిపోతాయి. వెక్కిళ్లు వచ్చినప్పుడు మనం కొద్ది కొద్దిగా నీళ్లు తాగడం వంటివి చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఎన్నిరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ వెక్కిళ్లు ఆగవు. ఈ వెక్కిళ్లను ఆయుర్వేదంలో ఉండే ఒక చిన్న చిట్కాను ఉపయోగించి అవి వచ్చిన వెంటనే తగ్గించుకోవచ్చు.
వెక్కిళ్లు ఎంతకీ ఆగనప్పుడు ఒక పావు లీటర్ ఆవు పాలను తీసుకుని వేడి చేయాలి. ఈ పాలలో పటిక బెల్లం పొడిని కలుపుకుని గోరు వెచ్చగా అయ్యాక కొద్ది కొద్దిగా తాగుతూ ఉండాలి. దీంతో వెంటనే వెక్కిళ్లు తగ్గిపోతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల వెక్కిళ్ల సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. అయితే ఇలా చేసినా కూడా వెక్కిళ్లు తగ్గకపోతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.