Black Gram : మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో మినపగుళ్లు కూడా ఒకటి. మినపగుళ్లను పప్పుగా చేసి మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఉదయం అల్పాహారంలో భాగంగా తయారు చేసుకునే ఆహార పదార్థాల తయారీలో మినప పప్పును మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. మినప పప్పులో కూడా మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి. మినప పప్పును తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. వేడి చేసిన మినపగుళ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల మూత్రాశయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. జీర్ణశక్తి మెరుగుపడి మలబద్దకం సమస్య తగ్గుతుంది.
మినపగుళ్లను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య పెరడంతోపాటు వాటి నాణ్యత కూడా పెరుగుతుంది. మినపగుళ్లు ఆలస్యంగా జీర్ణమవుతాయి. కనుక వీటితో చేసే పదార్థాలలో నెయ్యిని కానీ, జీలకర్రను కానీ, కండ చక్కెరను కానీ వేసుకుని తినడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. మినపగుళ్లతో సున్నుండలను తయారు చేస్తారని మనకు తెలుసు. ఈ సున్నుండలను తినడం వల్ల శరీరానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. ఈ సున్నండలను తినడం వల్ల మేహ, వాత రోగాలు తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మినపగుళ్లతో ఇడ్లీలను లేదా ఆవిరి కుడుములను చేసుకుని కారం, నెయ్యి లేదా కండచక్కెరతో కలిపి తినడం వల్ల పురుషుల్లో నపుంసకత్వం తగ్గుతుంది.
మినపగుళ్లను, మెంతులను, ఉసిరికాయలను సమపాళ్లలో తీసుకుని నీటితో కలిపి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి బాగా ఆరిన తరువాత తలస్నానం చేస్తూ ఉండడం వల్ల చుండ్రు సమస్యతోపాటు ఇతర జుట్టు సంబంధిత సమస్యలు కూడా తగ్గి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. చాలాకాలం నుండి బహిష్టు ఆగిపోయిన స్త్రీలు మినుములను, పెరుగును, గంజిని ప్రతి రోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉండడం వల్ల ఆగిన బహిష్టు మరలా మొదలవుతుంది. ఈ విధంగా మినుములు మన శరీరానికి బలాన్ని చేకూర్చడంతోపాటు మనకు వచ్చే అనారోగ్య సమస్యలను నయం చేయడంలో కూడా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.