Joint Pain : ఒకప్పుడు పెద్దవారు మాత్రమే మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు. వయసు మీదపడే కొద్దీ ఎముకలు అరగడంతో ఈ సమస్య బారిన పడే వారు. కానీ ఈ తరుణంలో నడి వయస్కులు కూడా మోకాళ్ల నొప్పుల సమస్యతో బాధపడుతున్నారు. 30 ఏళ్లకే కీళ్ల నొప్పులతో చాలా మంది ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ వైద్యానికి ఎంతో ఖర్చు చేస్తున్నారు. ఇలా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి వాటి బారిన పడడానికి ముఖ్య కారణం పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడమే అని నిపుణులు చెబుతున్నారు. మన ఇంట్లో సహజ సిద్దంగా ఆయింట్ మెంట్ ను తయారు చేసుకుని వాడడంతో పాటు ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల మనం ఈ కీళ్ల నొప్పుల సమస్య నుండి బయటపడవచ్చు.
ముందుగా మనం ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కీళ్లనొప్పులు తగ్గుతాయి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కీళ్ల నొప్పులను తగ్గించడంలో వాల్ నట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో ఉండే పోషకాలు ఎముకలను దృఢంగా చేసి నొప్పులను తగ్గించడంలో దోహదపడతాయి. ప్రతీరోజూ 4 నుండి 5 వాల్ నట్స్ ను తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. అలాగే మన ఆహారంలో బాదం పప్పు కూడా ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు 5 బాదం గింజలను నానబెట్టి ఉదయాన్నే వాటిపై ఉండే పొట్టును తీసి తినాలి. ఇలా చేయడం వల్ల కీళ్లనొప్పులు తగ్గడంతో పాటు ఎముకలు దృఢంగా కూడా మారుతాయి.

అదే విధంగా రోజూ వారీ ఆహారంలో రాగులు, నువ్వులు ఉండేలా చూసుకోవాలి. వీటిని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత క్యాల్షియం లభించి కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కీళ్లనొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గడంతో పాటు వీటిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు రాని వారికి కూడా భవిష్యత్తులో రాకుండా ఉంటాయి. ఇప్పుడు మోకాళ్ల నొప్పులను తగ్గించే ఆయింట్ మెంట్ ను ఇంట్లో ఏవిధంగా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. దీనిని ఎలా వాడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇందుకోసం మనం ఒక టీ స్పూన్ పసుపును, అర టీ స్పూన్ ఉప్పును, ఒక టీ స్పూన్ ఆవనూనెను, 2 లేదా 3 చుక్కల లవంగం నూనె ఉపయోగించాల్సి ఉంటుంది. లవంగం నూనె అందుబాటులో లేని వారు లవంగాలను పొడిగా చేసి వాడవచ్చు. కీళ్ల నొప్పులతో బాధపడే వారు ముందుగా ఒక గిన్నెలో పసుపును, ఉప్పును వేసి కలపాలి. తరువాత ఆవనూనెను వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి. తరువాత ఇందులో లవంగం నూనెను కూడా వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పులను తగ్గించే ఆయింట్ మెంట్ తయారవుతుంది. ఇలా తయారు చేసుకున్న ఆయింట్ మెంట్ ను నొప్పులు ఉన్న చోట రాసి తరువాత దానిపై వేడి చేసిన కాటన్ వస్త్రంతో కాపడం పెట్టుకోవాలి లేదా ఆ వస్త్రాన్ని నొప్పి ఉన్న భాగం చుట్టూ చుట్టుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా ఈ ఆయింట్ మెంట్ ను వాడడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గు ముఖం పడతాయి. కీళ్ల నొప్పులతో బాధపడే వారు ఈ చిట్కాను పాటించడంతో పాటు పైన తెలిపిన ఆహార పదార్థాలను వాడడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.