P-Trap : నిత్య జీవితంలో మనం ఎన్నో వస్తువులను చూస్తుంటాం. వాటిని వాడుతుంటాం. కానీ వాటిని ఎలా తయారు చేశారు, అవి అలాగే ఎందుకు ఉన్నాయి, వేరే విధంగా ఎందుకు లేవు..? వంటి అంశాలను అసలు గమనించం. కానీ సరిగ్గా గమనిస్తే మనకు అనేక వస్తువుల గురించి అనేక విషయాలు తెలుస్తాయి. అలాంటి వస్తువుల్లో వాష్ బేసిన్ సింక్ కింద ఉండే పైపు కూడా ఒకటి. అవును, కరెక్టే. వాష్ బేసిన్ లో ఉండే నీళ్లను అది కిందకు పంపుతుంది. అంతేకదా అది చేసే పని. అంతకు మించి వేరే ఏ పని దానికి ఉంటుంది చెప్పండి..? దాని గురించి తెలుసుకోవాల్సింది పెద్దగా ఏముంటుంది..? అనే కదా మీరు అడగబోయేది. అయితే అవును, నిజంగా దాని గురించి తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. అదేమిటంటే..
మీరెప్పుడైనా గమనించారా..? వాష్ బేసిన్ సింక్ కింద ఉండే పైపును. అవును, కొద్దిగా వంకరగా తిరిగి అంటే.. ఆంగ్ల అక్షరం U షేప్‌లో ఉంటుంది అది. అవును, అదే. అయితే ఆ పైపు అలా ఎందుకు ఉంటుందో తెలుసా..? దాన్ని U షేప్‌లోనే ఎందుకు తయారు చేశారో తెలుసా..? అదే ఇప్పుడు చూద్దాం. ఏమీ లేదండీ.. చిత్రంలో చూశారుగా U షేప్‌లో ఉండడం వల్ల అందులో ఎప్పుడూ కొన్ని నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లు ఏం చేస్తాయంటే.. పైపు కింద కు కనెక్ట్ అయి ఉండే డ్రైనేజీ నుంచి వచ్చే దుర్వాసనను నిరోధిస్తాయి. కింద డ్రైనేజీ నుంచి వచ్చే గ్యాస్‌లు నేరుగా ఆ పైప్ ద్వారా పైకి రాకుండా ఉండేందుకు గాను మధ్యలో ఆ పైపుకు అడ్డుకట్ట వేయాల్సి ఉంటుంది. అందుకే దాన్ని U షేప్ వచ్చేలా తయారు చేశారు. దీని వల్ల అందులో ఎప్పుడూ కొంత నీరు ఆగి ఉంటుంది. కనుక కింది వైపు డ్రైనేజీ నుంచి వచ్చే దుర్వాసన నీటి వద్ద ఆగిపోతుంది. దీంతో గ్యాస్ పైకి రాదు, మనకు దుర్వాసన రాదు.
ఇలా U షేప్‌లో ఉండే ప్రాంతాన్ని పి ట్రాప్ (P-trap) అని అంటారు. ఈ ట్రాప్ గనక డ్యామేజ్ అయితే అప్పుడు నీరు ఉండదు కనుక దాన్నుంచి దుర్వాసన పైకి వస్తుంది. అది ఇంట్లోకి వ్యాప్తి చెందుతుంది. కాబట్టి మీకు ఇంట్లో కిచెన్ వాష్ బేసిన్ నుంచి దుర్వాసన వస్తుందని అనిపించినప్పుడు ఒకసారి ఈ ట్రాప్‌ను చెక్ చేసుకోండి. డ్యామేజ్ ఉంటే రిపేర్ చేయించుకోండి. అయితే ఇలాంటి ట్రాప్‌లు టాయిలెట్లలో టాయిలెట్ బేసిన్ కింద వైపు కూడా ఉంటాయి. దాని వల్ల కూడా మన టాయిలెట్‌లోకి డ్రైనేజీ నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.