ప్లాస్టిక్… నేడు ఎక్కడ చూసినా దీని వాడకం ఎక్కువైపోయింది. వాటర్ బాటిల్స్ మొదలుకొని అనేక ఆహార పదార్థాల కోసం ప్లాస్టిక్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. దీని వల్ల మనకే కాదు, పర్యావరణానికీ ఎంతో నష్టం కలుగుతోంది. ఎన్నో రకాల అనారోగ్యాలకు మనం గురవుతున్నాం. వాటిలో క్యాన్సర్ వంటి వ్యాధులు మొదటి స్థానంలో ఉన్నాయి. అయితే ప్లాస్టిక్‌తో తయారు చేసిన ఏ బాటిల్ అయినా, పాత్ర అయినా, ఇంకే ఇతర వస్తువుపైనైనా ఒక కోడ్ ప్రింట్ చేయబడి ఉంటుంది. దాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా..? లేదా..? అయితే అది ఎందుకో, దాని వల్ల మనకు ఏం తెలుస్తుందో చూడండి..!
సాధారణంగా ప్లాస్టిక్ వస్తువులపై HDPE, HDP, PP, PETE, V, LDPE, PS అనే పదాలు ప్రింట్ చేయబడి ఉంటాయి. వాటి అర్థం ఏమిటంటే… సదరు వస్తువును సంబంధిత ప్లాస్టిక్ మిశ్రమంతో తయారు చేశారని అర్థం. ఒక్కో ప్లాస్టిక్ వస్తువును ఒక్కో రకమైన విభిన్నమైన ప్లాస్టిక్ మిశ్రమంతో తయారు చేస్తారు. కనుకే ఆ మిశ్రమానికి చెందిన కోడ్‌ను సదరు ప్లాస్టిక్ వస్తువులపై రాస్తారు. ఆ కోడ్‌ను సరిగ్గా అర్థం చేసుకుంటే దాంతో మనకు ఎలాంటి హాని కలుగుతుందో, వాటిని వాడాలో, వద్దో అనే విషయాన్ని నిర్ణయించుకోవచ్చు. PETE లేదా PET… మినరల్ వాటర్, కూల్‌డ్రింక్స్ వంటి పదార్థాలను నిల్వ చేయడం కోసం ఈ తరహా కోడ్ ఉన్న బాటిల్స్‌ను, బాక్స్‌లను ఉపయోగిస్తారు. వీటిని కేవలం ఒకేసారి వాడాల్సి ఉంటుంది. రెండో సారి వాడితే ఆ బాటిల్స్‌లో నుంచి ప్రమాదకరమైన రసాయనాలు సదరు ఆహార పదార్థాల్లో కలిసి అవి నేరుగా మన శరీరంలోకి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. దీంతో అనేక రకాల హార్మోన్ సమస్యలు వస్తాయి.
HDP లేదా HDPE… ఈ కోడ్‌ను రాసి ఉన్న ప్లాస్టిక్ వస్తువులు, బాటిల్స్ కొంత వరకు సేఫే. ఇవి ఆహార పదార్థాల్లోకి తక్కువగా రసాయనాలను విడుదల చేస్తాయి. అయినా వీటి వల్ల కూడా మనకు ప్రమాదమే. PVC లేదా 3V… ఈ కోడ్ రాసి ఉన్న ప్లాస్టిక్ వస్తువులు రెండు రకాల విషపూరితమైన రసాయనాలను విడుదల చేస్తాయి. వీటి వల్ల మన శరీరంలో హార్మోన్లు దెబ్బతింటాయి. ఇలాంటి కోడ్‌లను రాసి ఉన్న బాటిల్స్‌లో నిల్వ చేసిన నీటిని తాగకూడదు. ఆహారాన్ని తినకూడదు. LDPE… ఈ తరహా ప్లాస్టిక్ ఎలాంటి కెమికల్స్‌ను విడుదల చేయదు. కానీ దీంతో తయారు చేసిన ప్లాస్టిక్ వస్తువులను కూడా వాడకూడదు.
PP… కాస్మొటిక్స్ వంటి పదార్థాల ప్యాకింగ్ కోసం ఈ ప్లాస్టిక్‌తో తయారు చేసిన బాటిల్స్‌ను వాడుతారు. ఇవి మన శరీరానికి హాని కలిగించేవే. అనేక అనారోగ్య సమస్యలను ఇవి తెచ్చి పెడతాయి. PS… కప్పులు, ప్లేట్లు వంటి పలు రకాల ప్లాస్టిక్ వస్తువుల తయారీ కోసం ఈ ప్లాస్టిక్‌ను వాడుతారు. దీన్ని పాలిస్టెరీన్ అని కూడా పిలుస్తారు. దీని వల్ల ప్రమాదకరమైన కార్సినోజెనిక్ కారకాలు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. PC… వాటర్ బాటిల్స్, ఫుడ్ బాక్స్‌లు వంటి వస్తువుల తయారీలో ఈ తరహా ప్లాస్టిక్‌ను వినియోగిస్తారు. ఇది అత్యంత ప్రమాదకరమైన ప్లాస్టిక్ మిశ్రమం. కనుక ఈ కోడ్ బాటిల్స్‌పై రాసి ఉంటే అందులోని ఏ పదార్థాన్నీ సేవించకూడదు.