1984 వరకూ జిల్లాకి వంద మంది గెజిటెడ్ ఆఫీసర్స్ ఉండేవారు. అంతకు పూర్వం1950 లలో రాష్ట్రంలో మొత్తం మూడు వందల లోపు ఉండే వారు. ప్రస్తుతం మండలానికే వంద మంది ఉన్నారు. బ్రిటిష్ పాలనా కాలంలో, ఏ అధికారి యొక్క, ప్రమోషన్లు, బదిలీలు, అవార్డు లు, పనిష్మెంట్లు, రిటైర్ మెంట్లు వగైరా వంటి సర్వీస్ వివరాలు రాష్ట్ర గెజిట్ పుస్తకంలో ముద్రించడానికి అర్హులో అట్టి వారిని గెజిటెడ్ ఆఫీసర్స్ అని నిర్వచించారు. వీరికి అప్పట్లో రాష్ట్ర మంతా బదిలీలు కూడా ఉండేవి.సర్వసాధారణంగా గెజిటెడ్ ఆఫీసర్స్ సమ్మె లలో పాల్గొనరు. ప్రస్తుతం అత్యవసర చట్టసవరణలు మాత్రమే అవసరం మేరకు గెజిట్ (రాజపత్రం)లో ప్రచురించి మిగిలిన వ్యక్తి గతమైనవి ముద్రణ వదిలేస్తున్నారు. 1990 వరకూ ప్రతి నెలా ఆంధ్రప్రదేశ్ రాజపత్రం అనే పేరుతో గెజిట్, జిల్లా కలెక్టర్ ఆఫీస్, తహశీల్దార్ ఆఫీస్ లాంటి కొన్ని ముఖ్యమైన ఆఫీసులకు పోస్ట్ లో పంపేవారు.
ప్రింటింగ్, స్టేషనరీ ఖర్చు పెరిగిపోవడం వలన ఈ సేవలు ముప్పై ఏళ్ల నుండి నిలిచిపోయాయి. రాను రాను ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడి, బలం తగ్గించడం కోసం చాలా నాన్ గెజిటెడ్ పోస్ట్ లను గెజిటెడ్ కేటగిరీ లో చేర్చేశారు. ఇలా ప్రధానోపాధ్యాయులు, లెక్చరర్స్, సబ్ ఇన్స్పెక్టర్ లు, పశువుల, మనుషులు డాక్టర్లు, ఆఫీస్ సూపరింటెండెంట్ లు, హెల్త్ ఆఫీసర్స్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ లు, స్కూళ్లు ఇన్స్పెక్టర్ లు, అడిగిన వారందరికీ కాణీ ఖర్చు లేని పని కనుక గెజిటెడ్ గా గుర్తిస్తూ జీవో ఇచ్చి పారేశారు. బదిలీలు కూడా కొన్ని పోస్ట్ లు జోనల్ లెవల్, మరికొన్ని జిల్లా లెవెల్ మార్పులు చేశారు. అందువలన ఎవరికి వారు కామన్ సెన్స్ ద్వారా వారు గెజిటెడ్ ఆఫీసర్ అవునో కాదో తెలుసు కోవడం తప్ప వీరికి ప్రత్యేక మైన గుర్తింపు చిహ్నాలు ఏమీ ఉండవు. పూర్వం గెజిటెడ్ ఆఫీసర్స్ కి ఒక వాహనం, బిళ్ళ బంట్రోతు, టెలిఫోన్ సౌకర్యం లాంటి సదుపాయాలు ఉండేవి. ప్రత్యేక అలవెన్సు కూడా నెలకు 200 రూపాయలు ఉండేది.
1985 నుండి అలవెన్స్ రద్దు చేశారు. బడ్జెట్ ఇస్తే అద్దె వాహనాల్లో తిరగవచ్చు. మండలాలు వచ్చాక చాలా ఆఫీస్ లలో జీప్ డ్రైవర్, నైట్ వాచ్ మెన్ పోస్ట్ లు పీకి పారేశారు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన కార్యాలయాలలో కొంత మంది జిల్లా స్థాయి అధికారులకు కూడా కార్యాలయం భవనం, స్టాఫ్, విడిగా ఒక గది, టేబుల్, కుర్చీ, వాహనం, ఫోన్, బంట్రోతు ఏమీ లేకుండా ఉన్నవారు కూడా ఉన్నారని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. అలాంటి వారు ఏదో మూల ఎక్కడో ఒకచోట కూర్చుని ఉద్యోగం చేసుకుంటూ గడిపేస్తున్నారు. గత ప్రభుత్వంలో పేరివిజన్ కమీషనర్ ను నియమించి, వారికి కార్యాలయం, సిబ్బంది, వాహనం ఏమీ కేటాయించకుండా రెండు సంవత్సరాలు గడిపేశారు. తరువాత తనకు తాను గానో లేక పై నుండి ఒత్తిడి వల్లనో వారు పదవికి రాజీనామా చేసి వెళ్లి పోయారు. అది వేరే విషయం అనుకోండి. మొత్తం మీద గెజిటెడ్ ఆఫీసర్ అనే పదం ఉనికిని కనిపెట్ట లేని గందరగోళం కల్పించడం జరిగింది.ఉద్యోగులలో ఏ రాయి అయితేనేమి పళ్ళూడకొట్టుకోవడానికి అనిపించే పరిస్థితి ఏర్పడింది.