జీవితంలో కొందరు కష్టాలను అడ్డంకిగా కాకుండా.. అవకాశాలుగా భావిస్తారు. అలాంటి వారి లైఫ్ ఎందరికో స్ఫూర్తినిస్తుంది. చిన్న వయసులోనే డబ్బు లేక రైల్వే స్టేషన్‌లో రాత్రులు గడిపిన ఒక వ్యక్తి ఈ రోజు రూ. 39,000 కోట్ల సంపదతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. అతని పేరు సత్యనారాయణ నువ్వాల్. రాజస్థాన్‌లోని ఒక సాధారణ గ్రామంలో పుట్టి, ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నాడు. ఈ రోజు దేశంలో పేలుడు పదార్థాల తయారీలో అగ్రస్థానంలో ఉన్న కంపెనీని నడిపిస్తున్నారు. ఆయన లైఫ్ జర్నీ కేవలం బిజినెస్ సక్సెస్ గురించి మాత్రమే కాదు. ధైర్యం, పట్టుదల గురించి కూడా చెబుతుంది.
సత్యనారాయణ నువ్వాల్ (Satyanarayan Nuwal) రాజస్థాన్‌లోని భీల్వాడా జిల్లాలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టారు. తండ్రి పట్వారీగా పనిచేసేవారు. ఆ ఉద్యోగంలో వచ్చే తక్కువ ఆదాయంతో కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉండేది. ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ కావడంతో సత్యనారాయణ పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. తర్వాత చదువును ఆపేసి జాబ్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. చిన్న వయసులోనే ఇంటి బాధ్యతలు తలకెత్తుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో తన జీవితాన్ని సరైన మార్గంలో పెట్టుకోవడానికి ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సత్యనారాయణకు 19 ఏళ్లకే పెళ్లి చేశారు. ఆ వయసులోనే ఆయన కుటుంబ బాధ్యతలను స్వీకరించారు. డబ్బు సంపాదించడానికి మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు వెళ్లారు. అక్కడ ఒక బంధువు వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్‌లో పనిచేసేవాడు. కానీ, సత్యనారాయణకు (Satyanarayan Nuwal) అక్కడ ఇల్లు అద్దెకు తీసుకునేంత స్తోమత లేదు.
దీంతో రైల్వే స్టేషన్‌లోనే పడుకునేవారు. ఆ రోజుల్లో పొట్ట నింపుకోవడం కోసం ఫౌంటెన్ పెన్నులు అమ్మడం వంటి చిన్న చిన్న పనులు కూడా చేశారు. ఈ కష్టాల మధ్య కూడా ఆయన తన ఆశలను వదులుకోలేదు. కలలు కనడం మానలేదు. తన కష్టాలను ఏదో ఒక రోజు జయిస్తానని గట్టి నమ్మకంతో ముందుకు సాగారు. సత్యనారాయణ నువ్వాల్ చిన్నగా తన వ్యాపార జీవితాన్ని మొదలుపెట్టారు. 1995లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ. 60 లక్షల లోన్ తీసుకున్నారు. ఆ డబ్బుతో సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా అనే చిన్న యూనిట్‌ను స్థాపించారు. మొదట్లో ఈ కంపెనీ కోల్ ఇండియా లిమిటెడ్‌కు పేలుడు పదార్థాలను సరఫరా చేసేది. ఈ వ్యాపారంలో సక్సెస్ రావడం మొదలలైంది. ఒక సంవత్సరంలోనే రూ. 1 కోటి ఇన్వెస్ట్ చేశారు. ఈ డబ్బు చిన్న యూనిట్‌ను పెద్ద తయారీ కేంద్రంగా మార్చడానికి సహాయపడింది.
1996లో అతని కంపెనీకి సంవత్సరానికి 6,000 టన్నుల పేలుడు పదార్థాలు తయారు చేసే కాంట్రాక్ట్ లభించింది. దీంతో కంపెనీ వేగంగా ఎదిగిపోయింది. ఈ విజయం సత్యనారాయణ (Satyanarayan Nuwal) కలలను మరింత బలపరిచింది. ఆ తర్వాత సోలార్ ఇండస్ట్రీస్ దేశంలోనే అతిపెద్ద పేలుడు పదార్థాల తయారీ సంస్థగా అవలరించింది. ఈ రోజు సత్యనారాయణ నువ్వాల్ సంపద రూ. 39,000 కోట్లు (సుమారు 4.6 బిలియన్ డాలర్లు) అని ఫోర్బ్స్ అంచనా వేసింది. ఆయన స్థాపించిన సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ ఇప్పుడు భారతదేశంలో పేలుడు పదార్థాల తయారీలో అగ్రస్థానంలో ఉంది. ఈ కంపెనీ గనులు, నిర్మాణ రంగాల కోసం ఎక్స్‌ప్లోజివ్స్‌ను తయారు చేస్తుంది. అంతేకాకుండా రక్షణ రంగంలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది.
2006లో ఈ కంపెనీ షేర్ మార్కెట్‌లోకి వచ్చింది. ఇప్పుడు ఈ సంస్థ 25 తయారీ కేంద్రాలతో 50కి పైగా దేశాలకు ఎగుమతులు చేస్తోంది. ఇక్కడితో ఆగకుండా సత్యనారాయరణ తన కంపెనీని డ్రోన్లు, రాకెట్ల తయారీ వైపు కూడా విస్తరించారు. ఇప్పుడు భారత రక్షణ శాఖకు కూడా సేవలు అందిస్తోంది. సత్యనారాయణ నువ్వాల్ (Satyanarayan Nuwal) కేవలం వ్యాపారంలోనే కాదు, సమాజ సేవలోనూ ముందున్నారు. నిజాయతీతో పనిచేస్తూ.. పర్యావరణానికి హాని చేయని వ్యాపార పద్ధతులను అనుసరించాలని నమ్ముతారు. సోలార్ ఇండస్ట్రీస్ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. తన సంపదలో కొంత భాగాన్ని సామాజిక కార్యక్రమాల కోసం వెచ్చిస్తున్నారు. ఇలా ఆయన ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అతని జీవితం కష్టాల నుంచి విజయం వైపు సాగిన ఒక అద్భుత ప్రయాణంగా కనిపిస్తుంది.