గూగుల్… ఈ సంస్థ గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి లేదు. అంతలా ఇది ప్రసిద్ధిగాంచింది. గూగుల్ సెర్చ్, ఈ-మెయిల్, మ్యాప్స్, యూట్యూబ్… ఇలా చెప్పుకుంటూ పోతే గూగుల్ యూజర్లకు అందిస్తున్న సేవలు అన్నీ ఇన్నీ కావు. అలాంటి దిగ్గజ సంస్థ కు సీఈవో మన భారతీయుడు కావడం మనకు చాలా గర్వ కారణం. ఆయనే సుందర్ పిచాయ్. అయితే ఇంతకీ విషయం ఏమిటంటే… సాధారణంగా మనకు తెలిసి సాఫ్ట్‌వేర్ వాళ్లకు జీతాలు బాగా ఉంటాయని తెలుసు. నెలకు రూ.లక్షలు సంపాదిస్తేనే… అంతా..? అని నోరెళ్ల బెడతాం. మరి అలాంటిది గూగుల్ లాంటి ప్రఖ్యాత సాఫ్ట్ వేర్ కంపెనీకి సీఈవోగా పనిచేస్తున్న సుందర్ పిచాయ్ జీతం తెలిస్తే… ఇక మీరు ఎంతలా షాక్‌కు లోనవుతారో..!
గూగుల్ సంస్థ సుందర్ పిచాయ్‌కు 2022 సంవత్సరానికి గాను చెల్లించిన మొత్తం జీతం ఎంతో తెలుసా..? అక్షరాలా 226 మిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో దాని విలువ రూ.1958 కోట్లు. అవును మరి… ముందే చెప్పాం కదా… మీరు షాకవుతారని. అంటే ఇది ఒక సంవత్సరం జీతం అన్నమాట. మరి దీన్ని నెలకు తీసుకుంటే అప్పుడది రూ.163 కోట్ల దాకా అవుతుంది. మరి రోజుకు తీసుకుంటే అది రూ.5.43 కోట్లు అవుతుంది. ఇక దాన్ని నిమిషాల వరకు లెక్కకడితే… అప్పుడది రూ.37,708 దాకా అవుతుంది. అంటే సుందర్ పిచాయ్ గూగుల్ సీఈఓగా పనిచేస్తున్నందుకు గాను ఒక నిమిషానికి తీసుకుంటున్న జీతం అక్షరాలా రూ.37,708 అన్నమాట. బాప్ రే..! అని గుడ్లు తేలేయకండి. ఇది నిజమే.
2015లో సుందర్ పిచాయ్‌కు లభించింది రూ.600 కోట్లు మాత్రమే. కానీ ఆయన చేస్తున్న పని, చూపుతున్న ప్రతిభకు గాను గూగుల్ యజమానులు ఆయన శాలరీని తరువాత డబుల్ చేసేశారు. దీంతో పిచాయ్ ఆ మేర శాలరీ ఆర్జిస్తున్నారు. అయితే రూ.1958 కోట్లలో కేవలం రూ.6 కోట్లు మాత్రమే పిచాయ్ గౌరవ వేతనం అట. మిగిలింది కూడా వేతనమే కానీ… అదంతా షేర్ల రూపంలో గూగుల్ ఆయనకు ఇచ్చింది. అయినప్పటికీ వాటి విలువ ప్రస్తుతం అంతే కదా..! ఏది ఏమైనా సుందర్ పిచాయ్ ప్రతిభ, ఆయన ఆర్జిస్తున్న వేతనం అమోఘం కదా..!