మన శరీరానికి అవసరం అయ్యే అనేక విటమిన్లలో విటమిన్ బి1 కూడా ఒకటి. ఇది మనకు కావల్సిన ముఖ్యమైన విటమిన్లలో ఒకటి. దీన్ని మన శరీరం సొంతంగా తయారు చేసుకోలేదు. అందువల్ల రోజూ ఆహారాల ద్వారా దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. విటమిన్ బి1నే థయామిన్ అని కూడా అంటారు. ఇది మన శరీరంలో అనేక రకాల జీవక్రియలను నిర్వర్తిస్తుంది. అందువల్ల ఈ విటమిన్‌ను మనకు సరిగ్గా అందేలా చూసుకోవాలి.
మన శరీరంలో అనేక రకాల విధులను నిర్వర్తించేందుకు విటమిన్ బి1 ఉపయోగపడుతుంది. మనం తినే ఆహారాన్ని శక్తిగా మార్చేందుకు, ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేసేందుకు, కణాలకు శక్తిని అందించేందుకు.. ఈ విటమిన్ మనకు అవసరం. ఇది లేకపోతే శరీరంలో పనులు సరిగ్గా జరగవు. విటమిన్ బి1 నీటిలో కరుగుతుంది. దీని వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాలను కచ్చితంగా తెలుసుకోవాలి.
విటమిన్ బి1 చిన్నపేగులను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయం చేస్తుంది. జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే హైడ్రోక్లోరిక్ యాసిడ్ నుంచి జీర్ణాశయం, పేగులను రక్షిస్తుంది. మనం తినే ఆహారాల్లో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా గ్రహించేలా చేస్తుంది. కార్బొహైడ్రేట్లను జీర్ణం చేసి గ్లూకోజ్‌గా మార్చేందుకు, తద్వారా శక్తిని అందించేందుకు ఈ విటమిన్ ఉపయోగపడుతుంది. విటమిన్ బి1 లెవల్స్ సరిగ్గా ఉంటే ఎల్లప్పుడూ శక్తి ఉన్నట్లు ఫీలవుతారు. ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు.
మన శరీరంలో విటమిన్ బి1 ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. దీంతో శరీరంలోని అవయవాలకు తగినంత ఆక్సిజన్ ఎల్లప్పుడూ అందుతుంది. అవయవాలు సరిగ్గా పనిచేస్తాయి. విటమిన్ బి1 రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధులు రాకుండా చూస్తుంది. తెల్ల రక్త కణాలు సరిగ్గా పనిచేసేలా చేస్తుంది. దీంతో మన శరీరంలో చేరే సూక్ష్మ జీవులు నశిస్తాయి. వ్యాధులు రాకుండా ఉంటాయి.
విటమిన్ బి1 లోపిస్తే కండరాలు బలహీనంగా మారుతాయి. నొప్పులు కలుగుతాయి. ఏ పనీ చేయలేరు. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆకలి ఉండదు. చేతులు, పాదాల్లో సూదులతో గుచ్చినట్లు అనిపిస్తుంది. శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఎదురవుతాయి. వాపులు వస్తాయి. అందువల్ల ఈ లక్షణాలు ఉంటే విటమిన్ బి1 లోపంగా భావించాలి. వెంటనే విటమిన్ బి1 ఉండే ఆహారాలను తీసుకోవాలి.
విటమిన్ బి1 మనకు.. పచ్చి బఠానీలు, పాలకూర, టమాటాలు, గుమ్మడికాయ విత్తనాలు, నువ్వులు, చియా సీడ్స్, క్వినోవా, పుట్ట గొడుగులు, పొద్దు తిరుగుడు విత్తనాలు, మటన్ లివర్, సోయాబీన్, ఓట్స్ వంటి ఆహారాల్లో లభిస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల విటమిన్ బి1 లభిస్తుంది. ఆ లోపం నుంచి కూడా బయట పడవచ్చు.