చికెన్, మటన్, ఫిష్, రొయ్యలు, ఎగ్స్… ఇలా నాన్ వెజ్‌లలో ఏ వెరైటీని తీసుకుని వంట చేసినా ఆయా వంటకాలను చాలా మంది నాన్ వెజ్ ప్రియులు ఇష్టపడతారు. లొట్టలేసుకుంటూ ఎంచక్కా వాటిని లాగించేస్తారు. అయితే ఏ నాన్‌వెజ్ ఆహారం తిన్నా దానితో కలిపి లేదా దాని తరువాత కొందరు పాలు లేదా పాల సంబంధ పదార్థాలైన పెరుగు, నెయ్యి వంటి వాటిని తింటారు. తాగుతారు. కొందరు మాత్రం వాటిని తినరు. అయితే దీనిపై చాలా మందిలో కొన్ని అపోహలు ఉన్నాయి. అవేమిటంటే…
చికెన్, మటన్… ఇలా ఏదైనా నాన్‌వెజ్ వంటకాన్ని తింటూనే, లేదా తిన్నాకైనా కూడా పాలు, పెరుగు వంటివి తాగడం మంచిది కాదని, దాంతో మన ఆరోగ్యానికి చేటు కలుగుతుందని చాలా మంది నమ్ముతారు. అయితే నిజానికి ఎందులో ఎంత మాత్రం వాస్తవం లేదంటున్నారు వైద్యులు. చికెన్, మటన్ లాంటి నాన్‌వెజ్ ఆహారాల్లో ప్రోటీన్లు ఎలా అయితే ఉంటాయో పాలు, పెరుగుల్లోనూ ప్రోటీన్లు అలాగే ఉంటాయి. అయితే నాన్‌వెజ్ వంటకాలను తిన్నాక పాలు, పెరుగు తాగితే దాంతో రెండు ఆహారాల నుంచి పెద్ద మొత్తంలో ప్రోటీన్లు మన శరీరానికి అందుతాయి. ఈ క్రమంలో అంత పెద్ద మొత్తంలో అందే ప్రోటీన్లను అరిగించుకుంటే ఓకే. లేకపోతే అజీర్ణం ఇబ్బందులు పెడుతుంది.
అదేవిధంగా చేపలు వంటి వాటిని తిన్నాక పాలు, పెరుగు వంటివి తాగితే కొందరిలో స్కిన్ అలర్జీలు వస్తాయట. దీనికి తోడు, గుండె జబ్బులు ఉన్నవారు పెద్ద మొత్తంలో అలా ప్రోటీన్లను ఒకేసారి తినడం మంచిది కాదట. అయితే ఇలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నవారు దేంతో దేన్నయినా తినవచ్చట. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవట. అంతేకానీ ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తాయనుకుంటే మాత్రం అలా తినకపోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు..!