Salt : మనం రోజూ అనేక రకాల వంటల్లో ఉప్పును వేస్తుంటాం. అసలు ఉప్పు వేయనిదే ఏ వంటకమూ పూర్తి కాదు. ఉప్పుతోనే వంటలకు రుచి వస్తుంది. అయితే కొందరు అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి ఉప్పును తినడం పూర్తిగా మానేస్తుంటారు. వాస్తవానికి ఇలా చేయడం ప్రమాదకరమట. ఈ మేరకు వైద్యులు పలు కీలక విషయాలను వెల్లడిస్తున్నారు. అసలు ఉప్పును తినడం పూర్తిగా మానేయరాదని.. అలా మానేస్తే అనేక అనర్థాలు సంభవిస్తాయని వారు చెబుతున్నారు. ఇంతకీ అసలు వారు ఏమంటున్నారంటే..
మన శరీరానికి కావల్సిన పలు ముఖ్యమైన పోషకాల్లో ఉప్పు ఒకటి. దీని వల్ల కండరాల కదలికలు, నాడుల్లో సమాచార ప్రవాహం, హృదయ స్పందనలు, మెటబాలిజం వంటి పనులు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతాయి. ఈ క్రమంలోనే ఉప్పు అంటే సోడియం క్లోరైడ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో 39 శాతం సోడియం, 61 శాతం క్లోరిన్ ఉంటాయి. రెండింటినీ కలిపి సోడియం క్లోరైడ్ లేదా ఉప్పుగా పరిగణిస్తుంటాం. ఇక మన శరీర బరువులో ఉప్పు 0.5 శాతం మేర ఉంటుంది.
మన శరీరంలో ఉప్పు సోడియం, క్లోరైడ్ అయాన్స్‌గా విడిపోతుంది. ఈ క్రమంలోనే సోడియం కణాల లోపల, బయట ద్రవాలను నియంత్రణలో ఉంచుతుంది. దీంతో నాడులు, కండరాలు సరిగ్గా పనిచేస్తాయి. అయితే ఎప్పుడైతే వరుసగా 10 రోజుల పాటు ఉప్పును తినరో అప్పుడు కణాల లోపల, బయట ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ద్రవాల సమతుల్యం తప్పుతుంది. ఫలితంగా నీరు కణాల్లోకి చేరుతుంది. ఈ క్రమంలోనే కణాలు వాపులకు గురి కావడం జరుగుతుంది. దీంతో శరీరం అంతా ఉబ్బిపోతుంది. అలాగే ఈ పరిస్థితి ఎక్కువైతే కణాలు పగిలిపోతాయి. అదే జరిగితే ప్రాణమే పోతుంది. కనుక ఉప్పును తీసుకోవడం పూర్తిగా మానేయకూడదని.. రోజులో తీసుకోవాల్సిన ఉప్పులో కాస్త తగ్గించి అయినా తీసుకోవాలి కానీ.. ఉప్పు తినడం మానేస్తే తీవ్ర అనర్థాలు సంభవిస్తాయని అంటున్నారు.
మన శరీరానికి తగినంత ఉప్పు లేకపోతే స్పృహ తప్పి పడిపోవడం, తలతిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో షాక్, కోమా లేదా మరణం వంటి విపరీతమైన పరిస్థితులకు కూడా దారి తీయవచ్చు. కనుక ఉప్పు తినడం మానేయాలని చూస్తున్నవారు ఆ ఆలోచనను విరమించుకోవాలి. కాకపోతే రోజులో తీసుకునే ఉప్పు శాతాన్ని కాస్త తగ్గించుకోవచ్చు. అంతేకానీ పూర్తిగా మానేయరాదు.
ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం మన శరీరానికి రోజుకు 2 గ్రాముల సోడియం అవసరం. అంటే అది 5 గ్రాముల ఉప్పు ద్వారా లభిస్తుంది. అంటే 1 టీస్పూన్ అన్నమాట. రోజుకు ఒక టీస్పూన్ మేర అయితే ఉప్పును తినవచ్చు. అంతకు మించకుండా చూసుకోవాలి. ఇలా ఉప్పును రోజూ సురక్షితమైన మోతాదులో తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండవచ్చు.