జుట్టు రాలిపోవడం అన్నది సహజంగానే చాలా మందికి ఎదురయ్యే సమస్యే. చిన్నా పెద్దా అందరిలోనూ ఈ సమస్య ఉంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. జుట్టు రాలిపోతుంటే ఎవరైనా సరే హైరానా పడుతుంటారు. ముఖ్యంగా పురుషులు అయితే బట్టతల వస్తుందేమోనని కంగారు పడుతుంటారు. అయితే జుట్టు రాలిపోవడం వెనుక ఉండే పలు ముఖ్యమైన కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. హైపో థైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం.. ఈ రెండింటిలో ఏ సమస్య ఉన్నా సరే జుట్టు రాలిపోతుంది. థైరాయిడ్ హార్మోన్లు సరిగ్గా పనిచేయకపోతే ఈ సమస్య వస్తుంది.
2. గర్భం ధరించిన స్త్రీలకు సహజంగానే జుట్టు రాలిపోతుంది. అయితే వారు ప్రసవించాక ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
3. డిప్రెషన్, విటమిన్ ఎ, క్యాన్సర్ మందులను వాడినా జుట్టు ఎక్కువగా రాలిపోతుంటుంది.
4. వంశ పారంపర్యంగా కూడా జుట్టు రాలిపోయే సమస్య వస్తుంది. ఇంట్లో పెద్దలకు ఎవరికైనా బట్టతల ఉంటే వారి పిల్లలకు జుట్టు ఎక్కువగా రాలిపోతుంది.
5. ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉన్నవారికి కూడా జుట్టు రాలిపోతుంది. 75 శాతం మందికి జుట్టు రాలిపోయే సమస్య ఈ కారణం వల్లే వస్తుంది. కనుక ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తే జుట్టు రాలిపోయే సమస్య నుంచి బయట పడవచ్చు.
6. పలు రకాల పోషక పదార్థాల లోపం ఉన్నా జుట్టు ఎక్కువగా రాలిపోతుంది.
7. శిరోజాలకు స్టయిల్ తరచూ చేయించడం, రసాయనాలను ఎక్కువగా వాడడం, కాలుష్యం, హెయిర్ డ్రయ్యర్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది.
8. ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారిలోనూ జుట్టు రాలుతుంది. అలాగే జుట్టు తడిగా ఉన్నప్పుడు ఎక్కువగా రాలుతుంది. కనుక తలస్నానం చేయగానే వెంటనే జుట్టును ఆరబెట్టుకోవాలి. తడి జుట్టు మీద దువ్వకూడదు.
9. బాగా చల్లగా, బాగా వేడిగా ఉండే నీటితో తలస్నానం చేయరాదు. గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. లేదంటే జుట్టు బాగా రాలిపోతుంది.