కరోనా వచ్చిన వారికి ఎలాంటి లక్షణాలు లేకపోయినా, స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్నా.. ఇంటి వద్దే ఉండి చికిత్స తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. అయితే అలాంటి వారిలో కొందరికి 2-3 రోజుల్లోనే లక్షణాలు ఎక్కువై పరిస్థితి ప్రాణాంతకంగా మారుతుంది. అలాంటి ఎందరో చనిపోయారు కూడా. కానీ కోవిడ్ వచ్చిన వారికి ఒక్క విషయంలోనే పరిస్థితి ప్రాణాంతకంగా మారుతుంది. అది శ్వాస తీసుకోలేకపోవడం.
కోవిడ్ వచ్చిన వారిలో ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. కనుక శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. అయితే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే పరిస్థితి తీవ్రతరం కాదు. కానీ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే మాత్రం పరిస్థితి క్షణక్షణానికి క్షీణిస్తుంది. ముఖ్యంగా శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. అలాంటి వారు ఎప్పటికప్పుడు ఆ లక్షణాన్ని గమనిస్తూ ఉండాలి. ఇక శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ ను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి.
ఆక్సిజన్ లెవల్స్ పడిపోకుండా ఉండాలంటే కోవిడ్ పేషెంట్లు బోర్లా పడుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని అప్పట్లోనే సాక్షాత్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బోర్లా పడుకోవడం వల్ల ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి. దీంతో పరిస్థితి తీవ్రతరం కాకుండా నివారించవచ్చు.
బోర్లా పడుకోవడంతోపాటు మరో రెండు విధాలుగా కూడా పడుకుంటే శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ ను పెంచుకోవచ్చు. కనుక కోవిడ్ వచ్చిన వారు కచ్చితంగా బోర్లా పడుకోవాల్సి ఉంటుంది. అందుకు గాను కింద తెలిపిన చిత్రాలు సహాయం చేస్తాయి.
* బెడ్ మీద బోర్లా పడుకుని మెడ కింద, నడుం కింద, పాదాల కింద.. మొత్తం మూడు చోట్ల మూడు దిండ్లను పెట్టాలి. ఈ విధంగా 30 నిమిషాల పాటు పడుకోవడం వల్ల ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి.
* తల కింద, నడుం కింద, తొడల మధ్యలో మూడు దిండ్లను పెట్టుకోవాలి. ఈ విధంగా కూడా 30 నిమిషాల పాటు పడుకోవాలి. ఇదే స్టెప్‌ను ఇంకో వైపుకు తిరిగి చేయాలి.
* మూడు దిండ్లను ఒకదానిమీద ఒకటి పెట్టి వాటిపై వాలు కుర్చీలో వాలినట్లు పడుకోవాలి. ఇలా 30 నిమిషాల పాటు చేయాలి.
ఈ విధంగా చేయడం వల్ల శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ గణనీయంగా పెరుగుతాయి. ప్రాణాపాయం తప్పుతుంది. అనేక మంది వైద్య నిపుణులు కూడా ఈ విధానాలను సిఫారసు చేస్తున్నారు. కనుక కోవిడ్ బాధితులు తప్పక వీటిని అనుసరించాలి.