ఒత్తిడి, ఆందోళన అనేవి ప్రతి మనిషికి నిత్యం ఏదో ఒక సందర్భంలో వస్తూనే ఉంటాయి. అనేక కారణాల వల్ల ఈ రెండింటి బారిన పడుతుంటారు. అయితే ఒత్తిడి, ఆందోళన వచ్చేందుకు ఏమేం కారణాలు ఉంటాయి ? అవి వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఒత్తిడి, ఆందోళన వచ్చేందుకు శారీరక, మానసిక విషయాలు కారణాలు అవుతుంటాయి. రోజూ నాలుగు వైపులకు ప్రయాణించే ఉద్యోగాలు చేయడం.. అంటే ఇంటి నుంచి చాలా దూరం వరకు ప్రయాణించి ఉద్యోగం చేసి తిరిగి ఇంటికి చేరుకోవడం.. లేదా ఉద్యోగంలో భాగంగా రోజూ అనేక ప్రదేశాలకు తిరుగుతుండడం.. ఇవి ఒత్తిడి, ఆందోళన వచ్చేందుకు కారణాలు అవుతాయి.
ఇక కొత్తగా పాఠశాల లేదా కాలేజీలో చేరితే విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళన వస్తాయి. ఉద్యోగులకు కొత్తగా జాబ్‌లో చేరినా, కొత్త ప్రాజెక్టు చేసినా, అనుకున్న పని సకాలంలో పూర్తి చేయకపోయినా ఒత్తిడి, ఆందోళన వస్తుంటాయి. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు ఒత్తిడి, ఆందోళనలకు కారణం అవుతుంటాయి.
సుదీర్ఘకాలం పాటు వ్యాధుల బారిన పడి చికిత్స తీసుకోవడం, లేదా వ్యాధి ఎంతకూ తగ్గకపోవడం, ప్రమాదాల బారిన పడడం, కుటుంబంలో ఎవరినైనా లేదా స్నేహితులు, దగ్గరి వారు ఎవరైనా చనిపోవడం, వివాహం చేసుకోవడం, దాంపత్య జీవితంలో సమస్యలు, పిల్లలు పుట్టాక వచ్చే సమస్యలు.. ఇలా అనేక రకాల సమస్యలు ఒత్తిడి, ఆందోళనలను కలగజేస్తాయి.
ఒత్తిడి, ఆందోళన బారిన పడిన వారికి అవి కొందరికి తాత్కాలికంగా ఉంటాయి. కొందరికి అవి శాశ్వతంగా ఉండి బాధిస్తుంటాయి. దీంతో ఇతర వ్యాధుల బారిన పడతారు. ఒత్తిడి, ఆందోళనలను సుదీర్ఘకాలం నుంచి ఎదుర్కొంటున్న వారు డిప్రెషన్‌కు గురై ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. లేదా అధిక బరువు పెరుగుతారు. టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఒత్తిడి, ఆందోళన ఉన్నవారిలో పలు లక్షణాలు కనిపిస్తుంటాయి. అవేమిటంటే.. తరచూ కడుపునొప్పి వస్తుండడం, విరేచనం అయినట్లు అనిపిస్తుండడం, కండరాల బలహీనత, తలనొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం, వణికినట్లు అవడం, తలతిరగడం, తరచూ మూత్ర లేదా మల విసర్జన చేయడం, ఆకలిలో మార్పులు, నిద్రలేమి, విరేచనాలు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ విధంగా ఎవరైనా బాధపడుతుంటే ఏమాత్రం ఆలస్యం చేయరాదు. వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. లేదంటే ఒత్తిడి, ఆందోళన ఎక్కువ కాలం బాధిస్తాయి. చివరకు జరగరాని నష్టం జరుగుతుంది. కనుక ఈ లక్షణాలు ఉంటే వెంటనే స్పందించాల్సి ఉంటుంది.