Aloo 65 Dum Biryani : బంగాళాదుంపలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసిన వంటకాలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. వీటితో చేసుకోదగిన వంటకాల్లో ఆలూ 65 దమ్ బిర్యానీ కూడా ఒకటి. ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. మనకు ఎక్కువగా రెస్టారెంట్ లలో ఈ బిర్యానీ లభ్యమవుతుంది. ఈ ఆలూ 65 దమ్ బిర్యానీని అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఆలూ 65 దమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ 65 దమ్ బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఆలూ 65 తయారీకి కావల్సిన పదార్థాలు..
పెద్ద ముక్కలుగా తరిగిన బంగాళాదుంపలు – 300 గ్రా., కార్న్ ఫ్లోర్ – 2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, మైదా పిండి – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, గరం మసాలా – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
అన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన బాప్మతీ బియ్యం – ఒకటిన్నర కప్పు, నీళ్లు – రెండు లీటర్లు, అనాస పువ్వులు – 2, లవంగాలు – 6, యాలకులు – 4, దాల్చిన చెక్క – రెండు ఇంచుల ముక్క, మరాఠి మొగ్గలు – 3,బిర్యానీ ఆకు – 1, జాపత్రి – 1, ఉప్పు – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన పచ్చిమిర్చి – 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్.
బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – పావు కప్పు, వెల్లుల్లి రెబ్బలు – 2, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, ఎండుమిర్చి – 3, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1 ( చిన్నది), కరివేపాకు – రెండు రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, కాశ్మీరీ చిల్లి కారం – అర టీ స్పూన్, ఉప్పు – ఒక టీ స్పూన్, పెరుగు – అర కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నిమ్మరసం – ఒక టీ స్పూన్, వేయించిన జీడిపప్పు – అర కప్పు, ఫ్రైడ్ ఆనియన్స్ – గుప్పెడు, నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్, నీళ్లు – 100 ఎమ్ ఎల్.
ఆలూ 65 దమ్ బిర్యానీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకుని అందులో బంగాళాదుంప ముక్కలను, ఒక టీ స్పూన్ ఉప్పును వేసి 80 శాతం ఉడికించాలి. తరువాత ఈ ముక్కలను గిన్నెలోకి తీసుకుని అరగంట పాటు చల్లగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత ఈ బంగాళాదుంప ముక్కల్లో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకోవాలి. ఇవి అన్నీ కూడా ముక్కలకు పట్టేలా ముక్కలు చిదిరిపోకుండా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ముందుగా సిద్దం చేసుకున్న బంగాళాదుంప ముక్కలను వేసి వేయించుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి.
ఇందులోనే బియ్యం తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి నీటిని బాగా మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత నానబెట్టుకున్న బాస్యతీ బియ్యాన్ని వేసి 70 శాతం వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత జల్లిగంటెతో బియ్యాన్ని వడకట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అడుగు భాగం మందంగా ఉండే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలతో పాటు వెల్లుల్లి రెబ్బలను తరిగి వేసుకోవాలి. ఇవి వేగిన తరువాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలను వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత ధనియాల పొడి, జీలకర్ర, గరం మసాలా, కారం, కాశ్మీరీ చిల్లి కారం, ఉప్పు వేసి వేయించాలి.
ఇవి వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చిలికిన పెరుగును వేసి అంతా కలిసేలా బాగా కలపాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. ఇలా వేయించిన తరువాత ఇందులో 50 ఎమ్ ఎల్ నీళ్లు పోసి కలపాలి. నీళ్లు మరిగిన తరువాత నిమ్మరసం, కొత్తిమీర చల్లుకోవాలి. తరువాత వేయించిన బంగాళాదుంప ముక్కలను వేసి కలపాలి. వీటిని అర నిమిషం పాటు ఉంచి మరలా ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత పావు కప్పు జీడిపప్పుతో పాటు ఉడికించిన అన్నాన్ని కూడా వేసుకోవాలి. తరువాత దీనిపై మిగిలిన జీడిపప్పు, బంగాళాదుంప ముక్కలు, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర చల్లుకోవాలి. తరువాత మిగిలిన నీళ్లు, నెయ్యి వేసుకోవాలి. తరువాత దీనిపై తడిపిన అరటి ఆకు లేదా టిష్యూ పేపర్ ను ఉంచి ఆవిరి బయటకు పోకుండా మూత పెట్టాలి. దీనిని 8 నిమిషాల పాటు మధ్యప్థ మంటపై 7 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తరువాత 20 నిమిషాల పాటు మూత తీయకుండా అలాగే ఉంచాలి. 20 నిమిషాల తరువాత దీనిని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, చక్కగా ఉండే ఆలూ 65 దమ్ బిర్యానీ తయారవుతుంది. వీకెండ్స్ లో, ప్రత్యేక రోజుల్లో ఇలా బంగాళాదుంపలతో బిర్యానీని చేసుకుని తినవచ్చు. దీనిని ఇంట్లో అందరూ విడిచి పెట్టకుండా ఇంకా కావాలని అడిగి మరీ తింటారు.