Aloo Curry : బంగాళాదుంపలు మన ఆరోగ్యంతో పాటు సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో కూడా ఉపయోగపడతాయన్న సంగతి మనందరికి తెలిసిందే. వీటితో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. వాటిలో బంగాళాదుంప మసాలా కూర ఒకటి. బంగాళాదుంపలతో చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ మసాలా కూరను మనం కుక్కర్ లో కూడా తయారు చేసుకోవచ్చు. కుక్కర్ లో రుచిగా చాలా తక్కువ సమయంలో బంగాళాదుంపలతో మసాలా కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
బంగాళాదుంపలు – పావు కిలో, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన టమాట – 1 ( పెద్దది), యాలకులు – 2, లవంగాలు – 3, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – ఒకటిన్నర గ్లాస్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, పుదీనా – కొద్దిగా.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
అల్లం – 2 ఇంచుల ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 8, జీడిపప్పు – ఒక టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్.
ఆలూ మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంపలపై పొట్టును తీసి మరీ పెద్దగా కాకుండా ముక్కలుగా చేసుకోవాలి. ఈ ముక్కలను ఉప్పు నీటిలో వేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక జార్ లో మసాలా పేస్ట్ కు కావల్సిన పదార్థాలన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకోవాలి. తరువాత కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ తో పాటు లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి 2 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. తరువాత పెరుగు వేసి మరో నిమిషం పాటు వేయించాలి.
ఇప్పుడు నీళ్లు పోసి కలపాలి. తరువాత బంగాళాదుంప ముక్కలను వేసి కలపాలి. ఇప్పుడు కుక్కర్ పై మూత పెట్టి చిన్న మంటపై 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మూత తీసి కొత్తిమీర, పుదీనా వేసి కలిపి స్టవ్ ఆన్ చేసి మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కేవలం 15 నిమిషాల్లోనే ఎంతో రుచిగా ఉండే బంగాళాదుంప మసాలా కూర తయారవుతుంది. ఈ కూరను అన్నం, చపాతీ, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. సమయం తక్కువగా ఉన్న వారు ఇలా చాలా తక్కువ సమయంలోనే రుచిగా బంగాళాదుంప కూరను తయారు చేసుకుని తినవచ్చు.