Tomato Rasam : మన ఆరోగ్యానికి, అందానికి టమాటాలు ఎంతో మేలు చేస్తాయి. వంటల్లో టమాటాలను ఉపయోగించడం వల్ల చక్కటి రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. టమాటాలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. వీటితో రుచిగా ఉండే కూరలతో పాటు రసాన్ని కూడా తయారు చేస్తూ ఉంటాం. టమాట రసం చాలా రుచిగా ఉంటుంది. దగ్గు, జలుబు, జ్వరం వంటి వాటితో బాధపడుతున్నప్పుడు టమాటా రసాన్ని తీసుకోవడం వల్ల మనం కొద్ది పాటి ఉపశమనాన్ని పొందవచ్చు. ఈ టమాట రసాన్ని మరింత రుచిగా, సులభంగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట రసం తయారీకి కావల్సిన పదార్థాలు..
టమాటాలు – పావు కిలో, పచ్చిమిర్చి – 4, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, చింతపండు – చిన్న నిమ్మకాయంత, నీళ్లు – మూడు గ్లాసులు, కరివేపాకు – రెండు రెమ్మలు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కారం – అర టీ స్పూన్, నూనె – 3 టీ స్పూన్స్, ఎండుమిర్చి – 1, కచ్చా పచ్చాగ దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్.
మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు – 2 టీ స్పూన్స్, ఎండుమిర్చి – 2, ధనియాలు – ఒక టీ స్పూన్,మిరియాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 7, కరివేపాకు – ఒక రెమ్మ.
టమాట రసం తయారీ విధానం..
ముందుగా ఒక కుక్కర్ లో టమాటాలకు ఉన్న తొడిమలు తీసేసి వాటికి నాలుగు గాట్లు పెట్టి కుక్కర్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులోనే పచ్చిమిర్చిని ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. తరువాత చింతపండు, పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు, రెండు గ్లాసుల నీళ్లు పోసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తరువాత మూత తీసి వీటిని పప్పు గుత్తితో మెత్తగా చేసుకుని చేసుకోవాలి. తరువాత అంతా పోయేలా వడకట్టుకుని రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అందులో నీళ్లు, ఉప్పు, కారం, ఒక రెమ్మ కరివేపాకు, తరిగిన కొత్తిమీర వేసి పక్కకు పెట్టుకోవాలి. తరువాత ఒక కళాయిలో కందిపప్పు, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత ధనియాలు, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలను కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
ఈ పొడిని 3 టీ స్పూన్ల మోతాదులో తీసుకుని ముందుగా తయారు చేసుకున్న రసంలో వేసుకోవాలి. తరువాత ఈ రసాన్ని స్టవ్ మీద ఉంచి మూడు నుండి నాలుగు పొంగులు వచ్చే వరకు బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, పసుపు వేసి తాళింపు చేసుకోవాలి. ఈ తాళింపును ముందుగా మరిగించిన రసంలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట రసం తయారవుతుంది. దీనిని అన్నం, ఇడ్లీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే టమాట రసానికి బదులుగా పైన చెప్పిన విధంగా చేసిన టమాట రసం కూడా చాలా రుచిగా ఉంటుంది. పెద్దలతో పాటు పిల్లలు కూడా ఈ టమాట రసాన్ని ఇష్టంగా తింటారు.