Aloo Jeera : ఆలుగడ్డలను సహజంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటితో వేపుడు, పులుసు, చిప్స్ వంటివి చేస్తారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అలాగే టమాటాలతో కలిపి కూడా ఆలును వండుతారు. భిన్న రకాలుగా వంటల్లో ఆలుగడ్డలను వేస్తుంటారు. ఇవన్నీ ఎంతో రుచిగా ఉంటాయి. అయితే ఆలుగడ్డలతో ఆలు జీరాను కూడా చేసుకోవచ్చు. ఇది అన్నం లేదా చపాతీలు.. ఎందులోకి అయినా సరే ఎంతో రుచిగా ఉంటుంది. తయారు చేయడం కూడా సులభమే. ఆలు జీరాను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలు జీరా తయారీకి కావలసిన పదార్థాలు..
ఆలుగడ్డలు – 5, జీలకర్ర – 2 టీస్పూన్లు, ధనియాలు – అర టీస్పూన్, ఉప్పు – తగినంత, కారం – 1 టీస్పూన్, కొత్తిమీర తురుము – 1 టీస్పూన్, పుదీనా ఆకులు – 4, నెయ్యి – 1 టేబుల్ స్పూన్.
ఆలు జీరాను తయారు చేసే విధానం..
ముందుగా ఆలుగడ్డలను కుక్కర్‌లో మెత్తగా ఉడకబెట్టుకొని వాటిని క్యూబ్ షేప్ వచ్చేలా కట్ చేసి పెట్టుకోవాలి. తరువాత స్టవ్ పై టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో ఒక టీస్పూన్ జీలకర్ర వేసి గోధుమరంగులోకి వచ్చే వరకూ వేయించాలి. జీలకర్రను ఒక ప్లేట్ లో తీసుకొని తరువాత ధనియాలను కూడా బాగా వేయించాలి. తరువాత వీటిని మెత్తని పొడిగా చేయాలి. స్టవ్ పై మరో కడాయిని పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసి వేడయ్యాక మిగిలిన జీలకర్రను కూడా వేసి అందులో బంగాళదుంప ముక్కలను వేయాలి. వీటిలోకి ముందుగానే తయారు చేసుకున్న జీలకర్రపొడి, ధనియాల పొడిలతోపాటు ఉప్పు, కారం వేసి బాగా కలియబెట్టాలి. రెండు నిమిషాల పాటు సిమ్‌లో వేయించుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని వాటిపై కొత్తిమీర తురుము, పుదీనా ఆకులతో గార్నిష్ చేసుకోవాలి. దీంతో ఎంతో రుచికరమైన ఆలు జీరా రెడీ అవుతుంది. ఎప్పుడూ ఆలుతో రొటీన్ వంటకాలు కాకుండా ఒక్కసారి కొత్తగా ఇలా ట్రై చేయండి. ఎంతో బాగుంటుంది. అందరికీ నచ్చుతుంది.