Beetroot Pakoda : మనకు అందుబాటులో ఉండే కూరగాయల్లో బీట్‌రూట్ కూడా ఒకటి. బీట్‌రూట్ నుంచి వచ్చే రసం.. అది ఉండే రంగు కారణంగా చాలా మంది బీట్‌రూట్‌ను తినేందుకు ఇష్టపడరు. కానీ బీట్‌రూట్‌తో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. బీట్‌రూట్‌ను తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇక శనగపిండితో చేసే పకోడీల మాదిరిగానే బీట్‌రూట్‌తోనూ పకోడీలను చేసుకోవచ్చు. ఇవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. తయారు చేయడం కూడా సులభమే. ఈ క్రమంలోనే బీట్‌రూట్‌తో పకోడీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బీట్ రూట్ పకోడీల తయారీకి కావల్సిన పదార్థాలు..
బీట్ రూట్ తురుము – అర కప్పు, పచ్చి శనగ పప్పు – అర కప్పు (నానబెట్టుకోవాలి), జీలకర్ర – పావు టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్, బియ్యం పిండి – 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ – 1 టేబుల్ స్పూన్, కారం – 1 టీస్పూన్, ఉల్లిపాయలు – 2 (సన్నగా తరగాలి), కొత్తిమీర – 1 కట్ట, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – తగినంత.
బీట్ రూట్ పకోడీలను తయారు చేసే విధానం..
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బీట్ రూట్ తురుము, పచ్చి శనగపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బియ్యం పిండి, మొక్కజొన్నపిండి, ముందుగా కట్ చేసి ఉంచిన ఉల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీర తురుము, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి బాగా కలియబెట్టాలి. ఎక్కడా పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పాన్ ఉంచి అందులో డీప్ ఫ్రై కి సరిపోయేంత నూనె వేసుకొని బాగా వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ముందు తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని పకోడీల మాదిరిగా చిన్నచిన్నగా వేసుకొని బాగా కాలిన తర్వాత తీసేయాలి. ఈ విధంగా వేడివేడిగా బీట్ రూట్ పకోడీలను తయారు చేయవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని నేరుగా తినవచ్చు. లేదా టమాటా కెచప్ తో అద్దుకుని తినవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటాయి. అందరూ ఇష్టపడతారు.