Thelukondi Mokka : తేలు కొండి మొక్క.. దీనినే గరుడ ముక్కు చెట్టు, గద్దమాల చెట్టు, గొర్రె జిడ్డాకు చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు. దీనిని ఇంగ్లీష్ లో స్నేక్ హెడ్, టైగర్ క్లా, డెవిల్స్ క్లా అని పిలుస్తారు. ఇది మనకు గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ విరివిరిగా కనిపిస్తుంది. ఈ చెట్టు కాయలు గరుత్మంతుని ముక్కులుగా, నాగుపాము పడగ లాగా ఉంటాయి. ఈ తేలు కొండి మొక్కలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. భారతీయ సాంప్రదాయ వైద్యంలో ఎంతో కాలంగా ఈ మొక్కను ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఈ చెట్టును ఉపయోగించడం వల్ల మనం వివిధ రకాల అనారోగ్య సమస్యలను చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ చెట్టు ఆకులతో చేసిన కషాయాన్ని గొంతులో పోసుకుని పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. అలాగే ఈ చెట్టు కాయలను నీటితో నూరి గంధాన్ని తీయాలి. ఈ గంధాన్ని తేలు కుట్టిన చోట రాయడం వల్ల తేలు కాటు విషం హరించుకుపోతుంది.
అదే విధంగా ఈ చెట్టు ఆకులను దంచి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని తేలు కాటుపై పోసి ఆ ఆకుల ముద్దను దానిపై ఉంచాలి. ఇలా చేయడం వల్ల కూడా తేలు కాటు విషం హరిస్తుంది. అలాగే ఎండిన తేలు కొండి కాయలను పొడిగా చేసి కొబ్బరి నూనెలో వేసి కలపాలి. ఈ నూనెను వాపులు ఉన్న చోట రాయడం వల్ల వాపులు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. కేవలం ఔషధంగానే కాదు ఆధ్యాత్మికంగా కూడా ఈ చెట్టు మనకు ఎంతో సహాయపడుతుందని పూర్వం ఎక్కువగా నమ్మేవారు. ఈ మొక్క కాయలను ఇంట్లో ఉంచితే అదృష్టాన్ని తెస్తాయని అలాగే ఈ కాయలు ఇంట్లో ఉండడం వల్ల అద్భుత శక్తులు వస్తాయని పూర్వం ఎక్కువగా నమ్మేవారు. ఈ మొక్క ఆకులు రాత్రి పూట ఆకాశాన్ని చూస్తూ ఉంటాయి. ఉదయానే ఆకులు వాడిపోతాయి.
ఈ మొక్క ఆకులు రాత్రి పూట తపస్సు చేస్తాయని చాలా మంది భావిస్తారు.పూర్వం ఈ చెట్టు కాయలను ఇంటి గుమ్మానికి కట్టేవారు. నరదిష్టి, నరపీడ, నరఘోష వంటి వాటి వల్ల కలిగే చెడు ప్రభావం మనపై ఉండకుండా చేయడంలో ఈ కాయలు సహాయపడతాయని నమ్మేవారు. ఈ కాయలను ఇంట్లో ఉంచడం వల్ల ఆర్థిక కష్టాలు దూరమవుతాయని నమ్ముతారు. అలాగే ఈ కాయలను ఇంట్లో ఉంచడం వల్ల ఇంటి దరిదాపులకు కూడా భూత ప్రేత పిశాచాలు రాకుండా ఉంటాయని చెబుతూ ఉంటారు. ఈ విధంగా తేలు కొండి మొక్కను ఉపయోగించడం వల్ల ఆరోగ్యపరంగా అలాగే ఆర్థికంగా కూడా ఎన్నో లాభాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.