Aloo Pickle : మనకు అందుబాటులో ఉండే అనేక రకాల కూరగాయల్లో ఆలుగడ్డలు కూడా ఒకటి. ఇవి మనకు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. వీటితో మనం అనేక రకాల వంటలను చేసుకోవచ్చు. ఆలు ఫ్రై, చిప్స్, టమాటా కర్రీ, పులుసు, పులావ్.. ఇలా అనేక వంటకాలను మనం ఆలుగడ్డలతో చేసుకోవచ్చు. అయితే మీకు తెలుసా.. ఆలుగడ్డలతో ఎంతో రుచికరమైన పచ్చడిని కూడా పెట్టుకోవచ్చు. దీన్ని తయారు చేయడం కూడా సులభమే. ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలు పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
ఆలుగడ్డలు – 3, కారం – పావు కప్పు, ఉప్పు – తగినంత, ఆవ పిండి – పావు కప్పు, పసుపు – పావు టీస్పూన్, మెంతి పిండి – పావు టీస్పూన్, నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు – గుప్పెడు.
ఆలు పచ్చడిని తయారు చేసే విధానం..
ఆలుగడ్డలను పొట్టు తీసి మధ్యస్థంగా ఉండేలా ముక్కలుగా కట్ చేయాలి. వీటిని శుభ్రం చేసి కడిగి పొడి వస్త్రం మీద వేసి తడి లేకుండా తుడుచుకోవాలి. కడాయిలో నూనె వేసి వేడి చేసి ఆలుగడ్డ ముక్కలను వేసి 3 నిమిషాల పాటు వేయించాలి. ఇదే నూనెను బాగా చల్లార్చి ఉప్పు, కారం, పసుపు, ఆవ, మెంతి పొడి, వెల్లుల్లి రెబ్బలు, నిమ్మరసం అన్నీ వేసి బాగా కలపాలి. దీంట్లో ఆలుగడ్డలను వేయాలి. రెండో రోజున కూడా మిశ్రమాన్ని మళ్లీ కలపాలి. 3వ రోజున ఈ పచ్చడిని తినవచ్చు. ఇది చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది. అన్నం, చపాతీల్లోకి ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా సరే ఇష్టంగా తింటారు.