Aratikaya Bajji Recipe : మనకు కూరగా చేసుకుని తినేందుకు అనేక రకాల కూరగాయలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కూర అరటి కాయలు కూడా ఒకటి. సాధారణంగా అయితే అరటి పండ్లను తింటారు. కానీ కూర అరటి కాయలతో కూరలు చేస్తుంటారు. వీటిని భిన్న రకాలుగా వండుకోవచ్చు. అయితే అరటికాయలతో ఎంతో రుచిగా ఉండే బజ్జీలను కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని మనకు బయట విక్రయిస్తుంటారు. కానీ కాస్త శ్రమిస్తే ఇంట్లోనే ఎంతో రుచిగా ఉండేలా వీటిని తయారు చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే అరటికాయ బజ్జీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అరటికాయ బజ్జీల తయారీకి కావల్సిన పదార్థాలు..
అరటికాయ – 1, శనగపిండి – ఒక కప్పు, బియ్యం పిండి – పావు కప్పు, మిరపకారం – ఒక టీస్పూన్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – అర టీస్పూన్, కసూరీ మేథీ – ఒక టీస్పూన్, వంటసోడా – చిటికెడు, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా, వేయించిన పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, ఉల్లి తరుగు – అర కప్పు, నిమ్మరసం – ఒక టేబుల్ స్పూన్.

అరటికాయ బజ్జీలను తయారు చేసే విధానం..
అరటికాయల తొక్కు తీసి సన్నగా చక్రాల్లా తరిగి ఉప్పు నీళ్లలో వేసి పక్కన ఉంచాలి. ఒక గిన్నెలో శనగపిండి, బియ్యం పిండి, మిరపకారం, ఉప్పు, ధనియాల పొడి, కసూరీ మేథీ, వంట సోడా వేసి బాగా కలపాలి. తగినన్ని నీళ్లు జత చేస్తూ బజ్జీల పిండి మాదిరిగా కలపాలి. స్టవ్ మీద బాణలిలో నూనె కాగాక, అరటికాయ చక్రాలను ఒక్కోటి పిండిలో ముంచుతూ నూనెలో వేసి రెండు వైపులా దోరగా వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. కత్తితో బజ్జీలను ఒక వైపు సన్నగా కట్ చేయాలి. మూడు పల్లీలు, ఉల్లి తరుగు స్టఫ్ చేసి పైన నిమ్మరసం కొద్దిగా వేయాలి. వేడి వేడిగా తింటే రుచిగా ఉంటాయి. ఇలా అరటికాయ బజ్జీలను తయారు చేసి తినవచ్చు. ఎంతో రుచిగా ఉండడమే కాదు.. అందరికీ నచ్చుతాయి.