Ashadha Masam : మనం పురాతన కాలం నుండి వస్తున్న అనేక ఆచారాలను ఇప్పటికీ పాటిస్తూ ఉన్నాం. అలాంటి ఆచారాలలో ఆషాఢమాసంలో కొత్తగా పెళ్లైన దంపతులు వేరుగా ఉండాలనేది కూడా ఒకటి. మన పెద్దలు ఈ ఆచారాన్ని పెట్టడం వెనుక కూడా ఎంతో అర్థం ఉంది. ఆషాఢమాసంలో అత్తాకోడళ్లు ఇద్దరూ ఒకే గడప ఎందుకు దాటకూడదు.. నవ దంపతులు ఎందుకు దూరంగా ఉండాలి.. వంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అంటారు. వివాహాది శుభకార్యాలు ఈ మాసంలో చేయరు. పూజలు, వ్రతాలు వంటి శుభకార్యాలను మాత్రమే ఈ మాసంలో చేస్తారు. ఆషాఢం తెలుగు సంవత్పరంలో నాలుగవ నెల. ఈ సమయంలో సూర్యుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో దక్షిణానయం మొదలవుతుంది. ఇక ఆషాఢంలో కొత్తగా పెళ్లైన వారు ఒకే దగ్గర ఉండకూడదు అన్న ఆచారానికి ఆర్థిక, సామాజిక, ఆరోగ్యపరమైన కారణాలు ఉన్నాయి.
పూర్వకాలంలో వ్యవసాయం చేసే వారు ఎక్కువగా ఉండేవారు. ఆషాఢమాసంలో వర్షాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మాసంలో పొలం పనులు కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ కొత్త పెళ్లికొడుకు భార్య మీద ఆకర్షణతో పనులను నిర్లక్ష్యం చేస్తాడని అలాగే వ్యవసాయ పనులను వదిలేసి తన కొడుకు భార్య కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు అనే ఆలోచన ఆ ఇంటి అత్తగారిలో నాటుకుపోతుంది. దీంతో కుటుంబంలో మనస్పర్థలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అదే విధంగా ఈ మాసంలో భార్యాభర్తల కలయిక వల్ల స్త్రీలు గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. ఈ మాసంలో కనుక గర్భం దాల్చితే నిండు వేసవిలో ప్రసవం జరుగుతుంది. వేసవి కాలంలో ఉండే వేడి కారణంగా తల్లీబిడ్డల ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లుతుందనే ఉద్దేశంతో ఈ మాసంలో భార్యాభర్తలను దూరంగా ఉంచుతారు.
అలాగే కొత్తగా పెళ్లైన స్త్రీలకు పుట్టింటి మీద బెంగ ఉంటుంది. ఆ బెంగ పోవడానికి కొత్తగా పెళ్లైన స్త్రీని పుట్టింటికి పంపిస్తారు. ఆషాఢ మాసంలో శుభకార్యాలు చేయకపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా వస్తాయి. కనుక శుభకార్యాలు చేయడానికి వీలుపడదు. దీంతోపాటు వ్యవసాయ పనుల కారణంగా శుభకార్యాలకు రావడానికి కూడా ఎవరికీ తీరిక ఉండదు. అలాగే ఈ మాసం పెట్టుబడుల సమయం కాబట్టి అందరికీ డబ్బు సమస్య కూడా ఉంటుంది. కనుక ఆషాఢ మాసాన్ని శూన్య మాసంగా మన పెద్దలు నిర్ణయించారు. ఈ కారణాల చేత నవ దంపతులు ఆషాఢ మాసంలో దూరంగా ఉండాలని చెబుతుంటారు.