Cat : భారతీయులు శకునాలను ఎక్కువగా విశ్వసిస్తూ ఉంటారు. పక్షుల, జంతువుల చేష్టలను బట్టి శుభ, అశుభ ఫలితాలను శకున శాస్త్రంలో వివరించారు. మన వారు ఎక్కువగా నమ్మే శకునాలలో పిల్లి శకునం కూడా ఒకటి. పిల్లి ఎదురొస్తే మంచిదా కాదా.. అసలు పిల్లి శకునం ఎలా వచ్చింది… అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్లినప్పుడు మంచి శకునం చూసుకుని బయటకు వెళ్తాం. ఎవరినైనా ఎదురు రమ్మని అడుగుతూ ఉంటాం. అలా మనం బయటకు వెళ్లేటప్పుడు పిల్లి ఎలుకను నోట్లో పట్టుకుని ఎదురు వస్తే మనం వెళ్లే పని విజయవంతం అవుతుంది.
పిల్లి గనుక మనతోపాటు ఇంట్లో నుండి బయటకు వస్తే కార్యసిద్ధి కలుగుతుంది. బయటకు వెళ్లేటప్పుడు రెండు పిల్లులు కొట్లాడుకుంటూ ఎదురుపడితే మనం చేయబోయే పనిలో కలహాలు వస్తాయి. పిల్లిని కుక్కలు తరుముకుంటూ మన ఎదురుగా వస్తే శత్రు భయం, ధన నష్టం కలుగుతుంది. పిల్లి తన పిల్లలను ఏడు ఇళ్లకు మారుస్తుందట. ఇలా కనుక పిల్లి తన పిల్లలను నోట్లో పట్టుకుని మనకు ఎదురుగా వస్తే మనం చేయబోయే పనిలో ఆటంకాలతో పాటు స్థానచలనం కూడా కలుగుతుందట. ఇలా గనక పిల్లి ఎదురుగా వస్తే వెనక్క వచ్చి కాళ్లు కడుక్కుని కాసేపు కూర్చొని ఇష్ట దైవాన్ని తలుచుకుని బయటకు వెళ్లాలని శకున శాస్త్రం చెబుతోంది.
అయితే మనం ఇంట్లో పెంచుకునే పిల్లులకు ఈ శకునాలు వర్తించవు. పిల్లి శకునంలా మారడానికి వెనుక ఒక కథ కూడా దాగి ఉంది. పూర్వకాలంలో పాలను ఉట్టిమీద దాచే వారు. బయటకు వెళ్లేటప్పుడు పిల్లి కనిపిస్తే మరలా ఇంట్లోకి వచ్చి పాలను జాగ్రత్త చేసి పిల్లి వెళ్లిన తరువాత వెళ్లే వారు. ఇది కాస్తా పిల్లి శకునంలా మారిందని పెద్దలు అంటుంటారు. కేవలం భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల వారు కూడా ఈ పిల్లి శకునాన్ని విశ్వసిస్తారు. కొందరు పిల్లి శకునాన్ని విశ్వసిస్తారు. కొందరు మూఢనమ్మకం అని కొట్టి పారేస్తూ ఉంటారు. పిల్లి శకునాన్ని నమ్మడం, నమ్మకపోవడం మన మీద ఆధారపడి ఉంటుంది.