Atukula Chekodilu : మనం రకరకాల చిరుతిళ్లను తింటూ ఉంటాం. వాటిలో చకోడీలు కూడా ఒకటి. చకోడీలు చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు, పెద్దలు అందరూ వీటిని ఇష్టంగా తింటారు. మనకు మార్కెట్ లో, స్వీట్ షాపుల్లో ఇవి విరివిరిగా లభిస్తూ ఉంటాయి. ఈ చకోడీలను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అటుకులు వేసి చేసే ఈ చకోడీలు గుల్లగుల్లగా చాలా రుచిగా ఉంటాయి. రుచిగా, కమ్మగా అటుకుల చకోడీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అటుకుల చకోడీలా తయారీకి కావల్సిన పదార్థాలు..
అటుకులు – అర కప్పు, బియ్యం పిండి – ఒక కప్పు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, వేడి నీళ్లు – ఒక కప్పు, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, వాము – అర టీ స్పూన్, నువ్వులు – ఒక టీ స్పూన్, ఇంగువ – చిటికెడు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, నీళ్లు – తగినన్ని.
అటుకుల చకోడి తయారీ విధానం..
ముందుగా అటుకులను జార్ లో వేసి పొడిగా చేసుకోవాలి. తరువాత ఈ పొడిని జల్లెడలో వేసి జల్లించాలి. తరువాత బియ్యం పిండిని కూడా జల్లించాలి. తరువాత నెయ్యి, కారం, ఉప్పు, వాము, నువ్వులు, ఇంగువ వేసి కలపాలి. తరువాత వేడి నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు పిండిపై మూత పెట్టి చల్లారనివ్వాలి. పిండి చల్లారిన తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని మరీ మెత్తగా, మరీ గట్టిగా కలపకూడదు. ఇప్పుడు పిండిని మురుకుల గొట్టంలో ఉంచి తీగల్లాగా వత్తుకోవాలి. తరువాత వాటిని కావల్సిన పరిమాణంలో చకోడీలా చుట్టుకోవాలి. ఇలా అన్నింటిని చుట్టుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక చకోడీలను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై కలుపుతూ నూనెపై నురుగు పోయే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే నూనెలో కరివేపాకు వేసి వేయించి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల అటుకుల చకోడీలు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా వీటిని తినవచ్చు. పిల్లలు ఈ చకోడీలను ఇష్టంగా తింటారు.