Bahubali : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ రెండు పార్ట్‌లుగా వచ్చింది. మొదటి పార్ట్ కన్నా రెండో పార్ట్ మూవీయే అత్యధిక కలెక్షన్లను రాబట్టింది. ముఖ్యంగా మొదటి పార్ట్‌లో జక్కన్న పెట్టిన సస్పెన్స్ కారణంగానే రెండో పార్ట్‌ను చాలా మంది చూశారని చెప్పవచ్చు. అయితే రెండో పార్ట్‌లో మనకు యుద్ధం సీన్లో మహేంద్ర బాహుబలి భల్లాలదేవుడి కోటను బద్దలు కొట్టే సీన్ ఉంటుంది. ఆ సీన్లో తాటి చెట్లను చూపిస్తారు.
మహేంద్ర బాహుబలి తనకు ఉన్న కొద్దిపాటి సైన్యంతో భల్లాల దేవుడి కోట మీదకు యుద్ధానికి వస్తాడు. అయితే కోట ప్రధాన ద్వారం మూసివేస్తారు. దీంతో కోటలోకి కచ్చితంగా వేరే మార్గంలో ప్రవేశించాల్సి వస్తుంది. అప్పుడు తాటి చెట్ల సహాయంతో లోపలికి చేరుకుంటారు. ముగ్గురు, నలుగురు కలసి జట్టుగా ఏర్పడి చుట్టూ రక్షణ కవచాలను పెట్టుకుని తాటి చెట్టును సాగదీసి విడిచిపెడతారు. దీంతో ఆ ఊపు, వేగానికి కోటలో ఎగురుకుంటూ వెళ్లి పడతారు. అయితే సినిమాలో తాటి చెట్లను సులభంగా వంగేలా చేయవచ్చు.. అన్నట్లుగా చూపించారు. దీని గురించి ఎవరూ ఆలోచించలేదు. కానీ వాస్తవానికి తాటి చెట్లు అలా వంగుతాయా ? వాటిని వంచగలమా ? ఇందుకు సైన్స్ ఏమని సమాధానం చెబుతోంది ? అంటే..
తాటి చెట్లు వంగే గుణాన్ని కలిగి ఉంటాయి. కరెక్టే. కానీ బాహుబలి సినిమాలో చూపించినంత రబ్బరులా వంగవు. కేవలం 50 డిగ్రీల కోణం వరకు మాత్రమే వంగగలవు. అంతకు మించి ప్రయత్నిస్తే అవి విరిగిపోతాయి. కనుక అలా చూపించడం సినిమాల వరకే. వాస్తవానికి అది సాధ్యపడదని చెప్పవచ్చు.