Badam Palapuri : పాలపూరీలు.. మనం ఇంట్లో చేసుకునే తీపి వంటకాల్లో ఇవి కూడా ఒకటి. పాలపూరీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే వీటిని అప్పుడప్పుడూ ఇంట్లో కూడా తయారు చేస్తూ ఉంటారు. ఈ పాలపూరీలను మనం మరింత రుచిగా అలాగే ఆరోగ్యానికి మేలు చేసేలా కూడా తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా బాదంపప్పులు వేసి చేసే ఈ పాలపూరీలు మరింత రుచిగా, కమ్మగా ఉంటాయి. వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. మరింత రుచిగా ఆరోగ్యానికి మేలు చేసేలా బాదం పాలపూరీలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బాదం పాలపూరీ తయారీకి కావల్సిన పదార్థాలు..
బాదంపప్పు – 10, యాలకులు – 2, గోధుమపిండి – ఒక కప్పు, బియ్యంపిండి – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – చిటికెడు, నెయ్యి – ఒక టీ స్పూన్, పాలు – అరలీటర్, జీడిపప్పు – 5, గసగసాలు – ఒక టీ స్పూన్, పంచదార – 5 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
బాదం పాలపూరీ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో బాదంపప్పు, యాలకులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. ఇందులోనే బియ్యంపిండి, ఉప్పు, నెయ్యి, మిక్సీ పట్టుకున్న బాదంపొడి వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకుని పక్కకు ఉంచాలి. తరువాత ఒక జార్ లో మరో 10 బాదంపప్పులను, జీడిపప్పును, గసగసాలను, 5 యాలకులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు గిన్నెలో పాలు పోసి వేడి చేయాలి. పాలు మరిగిన తరువాత పంచదార, మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి. పంచదార కరిగి పాలు కొద్దిగా చిక్కబడేలా మరో 5 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపిన పిండిని మరోసారి కలుపుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. తరువాత ఒక్కో ఉండను తీసుకుంటూ పూరీలా వత్తుకోవాలి.
తరువాత ఈ పూరీలు పొంగకుండా ఫోర్క్ తో గాట్లు పెట్టుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన తరువాత పూరీలను వేసి కాల్చుకోవాలి. ఈ పూరీలను రెండు వైపులా కొద్దిగా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకున్న తరువాత వీటిని పాలల్లో వేసి గంటెతో లోపలికి వత్తాలి. వీటిని పాలల్లో 10 నుండి 15 సెకన్ల పాటు ఉంచి ఆ తరువాత ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. పూరీలు మెత్తగా ఉండాలనుకునే వారు మరికొద్ది సేపు పాలల్లోనే ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బాదం పాలపూరీలు తయారవుతాయి. తీపి తినాలనిపించినప్పుడు ఇలా రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా బాదం పూరీలను తయారు చేసుకుని తినవచ్చు. పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.