Bathani Chaat : మనకు సాయంత్రం సమయంలో చాట్ బండార్ లల్లో ఎక్కువగా లభించే వాటిల్లో బఠాణీ చాట్ కూడా ఒకటి. బఠాణీ చాట్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ బఠాణీ చాట్ ను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తినడానికి ఈ చాట్ చాలా చక్కగా ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే బఠాణీ చాట్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బఠాణీ చాట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండు బఠాణీలు – 2 కప్పులు, ఉడికించిన బంగాళాదుంపలు – 2, అల్లం – ఒక ఇంచు ముక్క, నూనె- 2 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన టమాట – 1, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – రెండు టీ స్పూన్స్, నీళ్లు – ఒకటిన్నర గ్లాస్చాట్ మసాలా – అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
బఠాణీ చాట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ముందుగా ఎండు బఠాణీలను శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టాలి. తరువాత వీటిని కుక్కర్ లో వేసి 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత ఒక జార్ లో అల్లం ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఉడికించిన బఠాణీల్లో సగం బఠాణీలను జార్ లో వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత ఉడికించిన బంగాళాదుంప ముక్కలను మెత్తగా చేసి వేసుకోవాలి. తరువాత ఉడికించిన బంగాళాదుంపలను, మిక్సీ పట్టుకున్న బఠాణీ మిశ్రమాన్ని వేసి కలపాలి.
తరువాత ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీనిని దగ్గర పడే వరకు మధ్యస్థ మంటపై ఉడికించాలి. తరువాత గరంమసాలా, చాట్ మసాలా వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించిన తరువాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బఠాణీ చాట్ తయారవుతుంది. దీనిని నిమ్మరసం, ఉల్లిపాయ ముక్కలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. బయట కొనుగోలు చేసే పని లేకుండా ఇలా ఇంట్లోనే బఠాణీ చాట్ ను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని పిల్లలతో సహా ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.